Home

»

Latest News

'జైల‌ర్‌2'కి పోటీగా 'ర‌ణ‌బాలి'.. ర‌జినీకాంత్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ 'హ్యాట్రిక్' కొడ‌తాడా.?

Oct 11, 2026 5:15PM

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మధ్య మరో ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోరుకు రంగం సిద్ధమైంది. చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ హీరో, ఒక యంగ్ హీరో చిత్రాలు ఒకే సమయంలో ముఖాముఖి తలపడటం సహజమే అయినా, వీరిద్దరి ట్రాక్ రికార్డును పరిశీలిస్తే ఒక ఆశ్చర్యకరమైన సెంటిమెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో రెండు పర్యాయాలు ఒకే నెలలో విడుదలైన సందర్భాల్లో రజనీ చిత్రాలపై విజయ్ దేవరకొండ సినిమాలు బాక్సాఫీస్ వద్ద స్పష్టమైన పైచేయి సాధించాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి దసరా బరిలో వీరిద్దరి చిత్రాలు ఒక్క రోజు తేడాతో థియేటర్లలోకి వస్తుండటం సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. 2016 జూలైలో వీరి మధ్య బాక్సాఫీస్ పోరుకు బీజం పడింది. ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్‌తో జూలై 22న రజనీకాంత్ నటించిన భారీ చిత్రం 'కబాలి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అంచనాల్ని అందుకోలేకపోవడం, పైగా మిక్స్‌డ్ రివ్యూల కారణంగా ఆ చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేక పరాజయం పాలైంది. సరిగ్గా వారం రోజుల వ్యవధిలోనే జూలై 29న ఎలాంటి ఆర్భాటం లేకుండా విజయ్ దేవరకొండ 'పెళ్ళి చూపులు' సినిమా విడుదలైంది. అప్పటికి విజయ్‌కి కనీసం ఫ్యాన్‌బేస్ లేకపోవడం పక్కనపెడితే తన మొహం కూడా చాలామంది సినీ ప్రియులకు తెలియదు. అయితే సరికొత్త కంటెంట్‌తో యువతను విశేషంగా ఆకట్టుకున్న ఆ చిత్రం కల్ట్ క్లాసిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, విజయ్ దేవరకొండను ఒక్కరాత్రిలో స్టార్‌ని చేసేసింది.

మళ్లీ రెండేళ్ల తర్వాత నవంబర్ 2018లో ఇదే తరహా సన్నివేశం ఎదురైంది. భారీ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్‌గా దాదాపు రూ. 500 కోట్ల వ్యయంతో శంకర్ తెరకెక్కించిన రజనీకాంత్ '2.0' (రోబో 2) నవంబర్ 29న గ్రాండ్‌గా విడుదలైంది. బడ్జెట్ భారీగా ఉండటంతో తెలుగు నాట ఆ చిత్రం కేవలం యావరేజ్ ఫలితానికే పరిమితమైంది. అంతకుముందే పైరసీ సమస్యలను దాటుకుని నవంబర్ 17న విడుదలైన విజయ్ దేవరకొండ చిత్రం 'టాక్సీవాలా' అనూహ్య వసూళ్లను సాధించి సూపర్ హిట్ ఖాతాలో చేరింది. ఇలా రెండోసారి కూడా రజనీకాంత్‌పై విజయ్ దేవరకొండ పైచేయి సాధించారు. ఇప్పుడు ఎనిమిదేళ్ల విరామం తర్వాత దసరా పండుగ వేళ ఈ ఇద్దరు హీరోలు మళ్లీ నేరుగా ఢీకొంటున్నారు. 

రజనీకాంత్ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'జైలర్ 2' అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా రానుండగా, మరుసటి రోజే అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ, రష్మిక మందానా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' విడుదల కానుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో 'జైలర్ 2' చిత్రానికి టికెట్లపై రూ. 50 నుంచి రూ. 75 వరకు ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు లభించడంపై నెటిజన్లు, ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డబ్బింగ్ సినిమాకు అంతటి భారం మోపడం పట్ల విమర్శలు వస్తున్నాయి. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ 'రణబాలి' చిత్రాన్ని ఎలాంటి టికెట్ ధరల పెంపు లేకుండా సాధారణ రేట్లకే ప్రజలకు అందిస్తోంది. దీనికి తోడు రాయలసీమ యోధుడి చారిత్రక కథ కావడం, విజయ్-రష్మిక కాంబోపై ఉన్న క్రేజ్ చిత్రానికి భారీ హైప్ తీసుకొచ్చాయి. గత రెండు రికార్డులను, ప్రస్తుత టికెట్ రేట్ల అనుకూలతను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ దసరా సీజన్‌లోనూ రజనీకాంత్‌పై విజయ్ దేవరకొండ ముచ్చటగా మూడోసారి పైచేయి సాధించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

 

 

[Vijay Deverakonda, Ranabaali Movie, Rajinikanth Jailer 2, Ranabaali vs Jailer 2, Ranabaali Box Office, Jailer 2 Release Date, Vijay Deverakonda Upcoming Movie]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com