తెలుగు వెండితెరపై అత్తాకోడళ్ల మధ్య సాగే పోరాటాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ముఖ్యంగా ‘అబ్బాయిగారు’ సినిమాలో అత్తాకోడళ్ల మధ్య జరిగే డ్రామా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. వెంకటేష్, మీనా జంటగా నటించిన ఈ చిత్రానికి ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించారు. జయచిత్ర, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, నూతన్‌ప్రసాద్, శ్రీకాంత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఆ సినిమాలోని ఒక పవర్‌ఫుల్ ఎపిసోడ్‌లోని విశేషాల గురించి తెలుసుకుందాం.
కుటుంబ బంధాలలో ప్రేమ ఎంత ఉంటుందో, కొన్నిసార్లు ఆస్తి కోసం లేదా అహంతో చేసే కుట్రలు కూడా అంతే బలంగా ఉంటాయి. ఈ కథలో అత్తగారు తన కోడలిని కొడుకు నుంచి విడదీయడానికి ఆడిన ఒక తెలివైన నాటకం మరెవరినైనా భయపెట్టేలా ఉంటుంది. తన కొడుకు జాతకంలో పెద్ద దోషం ఉందని, 28 ఏళ్లు వచ్చే వరకు భార్యతో కాపురం చేస్తే ప్రాణగండం పొంచి ఉందని అత్తగారు కోడలికి చెబుతుంది. అలాంటి సందర్భం వస్తే తన తాళిబొట్టు కాపాడుకోవడం కోసం ఏ భార్య అయినా భర్తకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. ఇక్కడ కోడలు కూడా అలాగే భావించి తన భర్తను దూరం పెడుతుంది.
అయితే ఈ నాటకం వెనుక ఉన్న అసలు ఉద్దేశం వేరు. కొడుకును, కోడలిని విడదీసి, ఆస్తిని కాజేయాల నేది ఆ అత్తగారి పన్నాగం. అత్తగారు ఆడుతున్నది నాటకమని, ఆమె నాగదేవత కాదు నాగుపాము అని మామగారి ద్వారా కోడలు తెలుసుకుంటుంది. తన అత్తగారి అసలు రంగు బయటపడటంతో, ఆమెపై తిరిగి అదే రీతిలో యుద్ధం ప్రకటించాలని నిర్ణయించుకుంటుంది. అత్తగారు ఆడిన ఆటతోనే ఆమెను ఓడించడానికి కోడలు సిద్ధమవుతుంది.
కోడలు కేవలం బాధపడటంతో ఆగిపోలేదు. ‘టిట్ ఫర్ టాట్’ అన్నట్లుగా అత్తగారి ఎత్తుగడలను చిత్తు చేస్తుంది. అత్తగారు తన కొడుకును కాపాడుకోవడానికి ప్రాణ త్యాగానికి సిద్ధమైనట్లు నటించగా, కోడలు కూడా తనదైన శైలిలో అత్తగారి ప్రాణాలకు గండం ఉందని చెప్పి, అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఈ క్రమంలో జరిగే సంభాషణలు ప్రేక్షకులలో నవ్వును, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. జయచిత్ర, మీనా అత్తా కోడళ్లుగా అద్భుతమైన నటన ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను మీకు అందిస్తున్నాం. చూసి ఆనందించండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.






