ఆ నిర్ణయం తీసుకొని ఉంటే అందరూ నన్ను కొట్టేవారు!
on Feb 16, 2026
సౌత్ ఇండస్ట్రీలో ఉన్న యాక్షన్ హీరోలలో అర్జున్‌కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అతను చేసిన యాక్షన్ సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొని యాక్షన్‌కింగ్ అయ్యారు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన అర్జున్ మొదట కన్నడ సినిమాలే చేశారు. 19 ఏళ్ళ వయసులోనే ‘సింహద మారి సైన్య’ అనే కన్నడ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. పిల్లలు ప్రధాన పాత్రల్లో నిర్మించిన ఈ సినిమాలో తన విన్యాసాలతో ఆకట్టుకున్నారు అర్జున్. ఈ చిత్రాన్ని ‘ఆజ్ కా షోలే’ పేరుతో హిందీలోకి డబ్ చేశారు జయా బచ్చన్.
ఈ సినిమా తర్వాత కన్నడలోనే సినిమాలు చేస్తూ ఆ తర్వాత తమిళ్, తెలుగు రంగాలకు కూడా పరిచయమ్యారు. తెలుగులో చేసిన తొలి సినిమా ‘మా పల్లెలో గోపాలుడు’ పెద్ద హిట్ అవ్వడంతో తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో వరస అవకాశాలు వచ్చాయి. చాలా తక్కువ సమయంలోనే అన్ని రకాల సినిమాలు చేస్తూ యాక్షన్ కింగ్ అనిపించుకున్నారు. అయితే 1990వ దశకం వచ్చేసరికి మూడు భాషల్లోనూ చేసిన సినిమాలు వరసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి.
అప్పటికే తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో 50కి పైగా సినిమాల్లో నటించిన అర్జున్.. వరస ఫ్లాప్‌ల కారణంగా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలోనే ఓ కొత్త డైరెక్టర్ తమిళ్ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాడు. అతనే శంకర్. ‘జెంటిల్‌మెన్’ అనే ఓ డిఫరెంట్ సబ్జెక్ట్‌తో వచ్చిన శంకర్.. మొదట ఈ కథను రజినీకాంత్, కమల్‌హాసన్ వంటి హీరోలకు వినిపించారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ ఇద్దరూ ఆ సినిమా కమిట్ అవ్వలేకపోయారు. ఆ సమయంలో ఆ అదృష్టం అర్జున్ తలుపు తట్టింది.
ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్న అర్జున్.. జెంటిల్‌మెన్ కథ విన్న తర్వాత తన డెసిషన్ మార్చుకున్నారు. ఆ కథ తను ఒప్ప్పుకోకపోతే తనంత తెలివితక్కువ వాడు ప్రపంచంలో ఉండరు అనుకున్నారు. మంచి సోషల్ మెసేజ్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఈ సినిమాలో ఉన్నాయి. అన్నివిధాల తనకు సరిపోయే కథ. ఆ సినిమా చెయ్యకపోతే అందరూ తనను కొడతారని కూడా భయపడ్డారట అర్జున్. అందుకే వెంటనే ఆ సినిమాకి ఓకే చెప్పేశారు. 1993లో విడుదలైన ఈ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా అందించిన విజయంతో దాదాపు 30 ఏళ్లుగా హీరోగా కొనసాగుతున్నారు అర్జున్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



