
ఒక్కోసారి మన కలల్లోకి కూడా రాని వింతలు జరుగుతుంటాయి. అందుకు నిదర్శనంగా సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ అబ్బురపరిచే ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు మనల్ని నవ్విస్తే, మరికొన్ని ఆలోచింపజేస్తాయి. కానీ, తాజాగా ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న వీడియో మాత్రం నెటిజన్లని ఆశ్చర్యానికి, షాక్‌కు గురిచేస్తోంది. సినిమా థియేటర్‌కు వెళ్లి ప్రశాంతంగా సినిమా చూస్తున్న ప్రేక్షకులకి ఊహించని అనుభవం ఎదురైతే ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
సాధారణంగా మనం థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు భారీ యాక్షన్ సీన్లు వస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. వెండితెరపై కార్లు గాల్లో ఎగరడం, పేలిపోవడం వంటివి చూసి థ్రిల్ ఫీలవుతాం. అయితే, ఆ స్క్రీన్ మీద కనిపించే కారు నిజంగానే థియేటర్ స్క్రీన్‌ని చీల్చుకుంటూ మన ముందుకు దూసుకొస్తే? ఊహించుకోవడానికే ఎంత భయానకంగా ఉందో కదా! సరిగ్గా ఇలాంటి విజువల్స్ తో కూడిన ఒక అద్భుతమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలను గమనిస్తే థియేటర్‌లో ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా సినిమా చూస్తున్నారు. స్క్రీన్‌పై ఒక హై స్పీడ్ కార్ చేజింగ్ సీన్ నడుస్తోంది. ఒక కారు అత్యంత వేగంగా స్క్రీన్ వైపు దూసుకువస్తున్నట్లుగా సీన్ ఉంది. అయితే, మరుసటి క్షణంలోనే అందరి గుండెలు ఆగిపోయేలా ఒక వింత జరిగింది. ఆ సినిమాలో ఉన్న కారు నిజంగానే సిల్వర్ స్క్రీన్ ని చీల్చుకుని నేరుగా ప్రేక్షకులు కూర్చున్న హాల్‌లోకి దూసుకువచ్చినట్లు కనిపించింది. ఈ షాకింగ్ విజువల్ చూడగానే థియేటర్‌లోని ప్రేక్షకులు ఒక్కసారిగా భయంతో సీట్లలోంచి లేచి కేకలు వేశారు.
అయితే, ఈ వీడియో వెనుక ఉన్న అసలు నిజం తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఇది నిజంగా జరిగిన ప్రమాదం కాదు, కేవలం ఒక అత్యాధునిక 3D లేదా 4D సాంకేతికతతో కూడిన మ్యాజిక్ అని తెలుస్తోంది. ప్రేక్షకులు థియేటర్‌లో కూర్చుని సినిమా చూస్తున్నప్పుడు వారికి సరికొత్త వాస్తవిక అనుభూతిని అందించడం కోసం ఈ విధమైన స్పెషల్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేసినట్లు సమాచారం. స్క్రీన్‌పై వచ్చే యాక్షన్ సీన్లకి అనుగుణంగా థియేటర్ స్టేజీపై కూడా లైటింగ్, పొగ, కారు నమూనాను ఉపయోగించి సృష్టించారు.
Also read: వారణాసి నుంచి మరో లీక్.. ఉగ్రాభట్టి గుహల వీడియో నెట్టింట్లో
ఈ వీడియో కొద్ది గంటల్లోనే లక్షలాది వ్యూస్,లైక్స్ ని సొంతం చేసుకుంది. ఈ క్రేజీ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "బాబోయ్.. నేను గనుక ఆ థియేటర్‌లో ఉంటే భయంతో గుండె ఆగిపోయేది" అని ఒకరు కామెంట్ చేయగా, "సాంకేతికత ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి ఇదొక నిదర్శనం, హాలీవుడ్ రేంజ్ క్రియేటివిటీ" అని మరికొందరు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.






