Home

»

Latest News

విడదీయాలని చూస్తే రోడ్డుపైనే కొడతాం.. ఫిల్మ్ ఫెడరేషన్, రఘు వర్గానికి సుమలత వార్నింగ్‌.!

Aug 31, 2026 7:52PM

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో చోటుచేసుకున్న అంతర్గత విభేదాలు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ నాయకత్వంలో మెజారిటీ సభ్యులు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుత అసోసియేషన్ అధ్యక్షురాలు, జానీ మాస్టర్ భార్య సుమలత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యూనియన్‌లో చిచ్చుపెట్టేందుకు చూస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు.

సోమవారం మీడియా ముందుకు వచ్చిన సుమలత, ఫిల్మ్ ఫెడరేషన్ వైఖరిని అలాగే రఘు మాస్టర్ వర్గం తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా ఖండించారు. తమ అసోసియేషన్‌కు ఏ నిబంధన ప్రకారం ఫెడరేషన్ సహాయ నిరాకరణ చేస్తోందో సూటిగా ప్రశ్నించారు. అసోసియేషన్‌ను రెండు ముక్కలు చేయాలని ఎవరు చూసినా, అలాంటి వారిని నడిరోడ్డుపై నిలబెట్టి కొడతామంటూ చాలా ఘాటుగా మాస్ వార్నింగ్ ఇచ్చారు.

ఆదివారం నిర్వహించిన అడ్ హాక్ కమిటీ సమావేశం ఎంతమాత్రం చెల్లదని సుమలత స్పష్టం చేశారు. ఆ కమిటీలో ఉన్న కొందరు సభ్యులు గతంలో అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయినవారేనని ఆమె ఆరోపించారు. 35 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న తమ యూనియన్‌ను ముక్రాజ్ మాస్టర్ ఎంతో శ్రమించి స్థాపించారని, ఎవడో ఒక ఫ్రాడ్ చేసిన వ్యక్తి వచ్చి అడ్ హాక్ కమిటీ వేస్తామంటే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు.

గతంలో తమ అసోసియేషన్ తరఫున నిర్వహించిన ఉపఎన్నికలు చట్టబద్ధంగానే జరిగాయని ఆమె సమర్థించుకున్నారు. 500 మంది ఉన్న యూనియన్‌లో 114 మంది ఓటు వేసినా అది ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల ప్రక్రియే అవుతుందని, చట్టపరమైన నిబంధనలకు కట్టుబడి మాత్రమే తాము ముందుకు వెళ్తున్నామని వివరించారు. లీగల్‌గా తమ కమిటీకే అన్ని అధికారాలు ఉంటాయని ఆమె స్పష్టం చేశారు.

ఇటీవలే ఫెడరేషన్ సహాయ నిరాకరణ, జానీ మాస్టర్ సస్పెన్షన్ పొడిగింపు వార్తల మధ్య రఘు మాస్టర్ కు శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ వంటి ప్రముఖ కొరియోగ్రాఫర్లు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఫెడరేషన్ తీరు మారకపోతే తాము కూడా ప్రత్యమ్నాయ చర్యలకు వెనుకడమని సుమలత తేల్చిచెప్పారు.

డ్యాన్సర్ల ప్రయోజనాలు కాపాడేందుకు తాము ఎంత దూరమైనా వెళ్తామని సుమలత స్పష్టం చేయడంతో ఈ వివాదం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఒకవైపు ఫెడరేషన్ మద్దతుతో రఘు మాస్టర్ వర్గం ముందుకు వెళ్తుంటే, మరోవైపు సుమలత చట్టపరమైన హెచ్చరికలతో తిరుగుబాటు చేయడం వల్ల ఈ అసోసియేషన్ సంక్షోభం రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

 

 

 

[Sumalatha Jani, Jani Master Wife, TFTDDA Dispute, Raghu Master Dancers Union, Tollywood Film Federation]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com