రానా పెళ్లి విషయంలో రాజమౌళి మాట నిజమైంది!
on May 16, 2020
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకడైన రానా దగ్గుబాటి తన ఫియాన్సీ మిహీకా బజాజ్‌ను ఇంట్రడ్యూస్ చేసి అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశాడు. మిహీకాతో కలిసున్న ఫొటోను సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసిన అతను "ఆమె సరేనంది" అని పోస్ట్ చేశాడు. అప్పట్నుంచీ రానా వలచిన మిహీకా ఎవరనే విషయం తెలుసుకోవడానికీ, వాళ్ల ప్రేమకథ ఎప్పట్నుంచి ఎలా మొదలైందనే విషయం తెలుసుకోడానికీ అభిమానులు ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు. అయితే రానా పెళ్లి విషయంలో డైరెక్టర్ యస్.యస్. రాజమౌళి అంచనా నిజమైందనే విషయం ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. "ప్రభాస్ కంటే ముందు రానా పెళ్లి పీటలు ఎక్కుతాడనేది తన అంచనా" అని గతంలో 'కాఫీ విత్ కరణ్' ప్రోగ్రామ్‌లో రాజమౌళి వెల్లడించాడు.
అందుకు తగ్గట్లే, ఇప్పుడు ప్రభాస్ కంటే ముందే రానా పెళ్లి చేసుకోవడం దాదాపు ఖాయమైంది. తన లేడీలవ్ ఎవరో కూడా రానా వెల్లడించేశాడు కాబట్టి రాజమౌళి మాటను అతను నిజం చేస్తున్నాడన్న మాట. రానా, మిహీకా పెళ్లి ఎప్పుడు జరగనుంది?.. ఇది ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేపుతున్న ప్రశ్న. 'కాఫీ విత్ కరణ్' ప్రోగ్రామ్‌లో ప్రభాస్, రానాలలో ముందు ఎవరు పెళ్లి చేసుకుంటారని రాజమౌళిని కరణ్ జోహార్ ప్రశ్నించాడు.
అప్పడు రాజమౌళి, "పెళ్లి విషయంలో ప్రభాస్ బాగా సోమరి కాబట్టి ముందుగా అతను పెళ్లి చేసుకుంటాడని నేననుకోవట్లేదు. రానా ఎక్స్ట్రావర్ట్. అతనెప్పుడు పెళ్లి చేసుకుంటాడనేది చెప్పలేను కానీ, ప్రభాస్ కంటే ముందుగానే అతను చేసుకుంటాడు" అని చెప్పాడు. రానా, మిహీకాల పెళ్లి ఈ ఏడాది చివరిలోగా జరుగుతుందని రానా తండ్రి సురేశ్‌బాబు తెలిపారు. సో.. 2020లో రానా పెళ్లి ఖాయం.. మరి ప్రభాస్ పెళ్లెప్పుడు?