TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

'మర్డర్'... వర్మ వర్సెస్ అమృత

Jun 22, 2020 12:37PM

సంచలనం సృష్టించిన హత్యోదంతాలు, వివాదాస్పద కథలను టచ్ చేసి... పబ్లిసిటీ పొందడం రామ్ గోపాల్ వర్మకు వెన్నతో పెట్టిన విద్య. ప్రజలు మర్చిపోయిన విషయాలను, మానిపోయిన గాయాలను మళ్లీ గుర్తు చేసి మాటలు రేపడం వర్మ నైజం. అమృత, మారుతీరావు కథతో సినిమా తీస్తున్నానని ప్రకటించి ఆయన అగ్గి రాజేశారు. 

మిర్యాలగూడలో ప్రణయ్ పరువుహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తక్కువ కులం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నదన్న కోపంతో, కన్నకూతురు కట్టుకున్న కుర్రాడిని కిరాయి హంతకుల చేత మారుతీరావు హత్య చేయించారు. కొన్నాళ్ళకు ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. పరువుహత్య, ఆత్మహత్య విషయంలో అమృతకు మద్దతుగా నిలిచే వ్యక్తులు కొందరైతే... మారుతీరావుకు మద్దుతు పలుకుతున్న వ్యక్తులు మరికొందరు ఉన్నారు. ఇప్పుడీ కథతో సినిమా తీస్తున్నానని ప్రకటించిన వర్మ, మరోసారి అప్పటి గాయాలను గుర్తు చేశారు.

"హ్యాపీ ఫాదర్స్ డే రోజున శాడ్ ఫాదర్స్ డే సినిమా ప్రకటిస్తున్నా. కూతురుని తండ్రి అతిగా ప్రేమించడం వల్ల వచ్చే అనర్థాల ఫలితాలను సినిమాలో చూపిస్తున్నా. అమృత, మారుతీరావు కథతో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులను హృదయాలను కదిలిస్తుంది" అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అంతకు ముందు అమృత, మారుతీరావు ఫొటోలతో వాళ్లపై సినిమా తీస్తున్నట్టు మరో ట్వీట్ చేశారు. సినిమాకు 'మర్డర్' అని టైటిల్ పెట్టారు. దీనిబట్టి ప్రణయ్ హత్య ప్రధానాంశంగా వర్మ సినిమా తీస్తున్నారని అర్థమైంది.   

రామ్ గోపాల్ వర్మ సినిమా ప్రకటనపై అమృత ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను ఎలా గౌరవించాలో నేర్పే తల్లి లేనందుకు వర్మను చూస్తే జాలేస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. వర్మ విడుదల చేసిన పోస్టర్ చూశానని, దానికి తన జీవితానికి ఎక్కడా పోలికలు లేవని ఆమె తెలిపారు. తమ పేర్లు వాడుకుని సినిమాను అమ్ముకోవడానికి వర్మ ప్రయత్నిస్తున్నాడని అమృత ఆరోపించారు. 

అమృత ఆరోపణలపై వర్మ స్పందించారు. 'మర్డర్'లో తాను ఏం చూపించబోతున్నాను అనేది సినిమా విడుదలైన తరవాత తెలుస్తుందని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న అమృత లెటర్ తను రాసిందా? ఎవరైనా రాశారా? అనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. లోకంలో చెడ్డ వ్యక్తులు ఎవరూ ఉండరని, పరిస్థితుల ప్రభావం వల్ల వ్యక్తులు చెడుగా కనపడతారని వర్మ అన్నారు. 'మర్డర్' చిత్రంలో ఆ పరిస్థితులను చూపిస్తానని చెప్పుకొచ్చారు.

google-ad-img