
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా తెరకెక్కనున్న తదుపరి చిత్రం #RAPO23 పై సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాతో రామ్ దర్శకుడిగా పరిచయమవుతుండటం విశేషం. అందుకే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న విపరీతమైన క్రేజ్‌ను కొందరు కేటుగాళ్లు తమ స్వార్థం కోసం వాడుకుంటూ మోసాలకు తెరలేపారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఈ సినిమాకు సంబంధించి నటీనటులు కావాలంటూ కొన్ని నకిలీ ప్రకటనలు, అనధికారిక కాస్టింగ్ కాల్ పోస్టర్లు జోరుగా హల్‌చల్ చేస్తున్నాయి.
ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవ్వడంతో పాటు నిర్మాణ సంస్థ దృష్టికి వెళ్ళింది. దీనిపై రాపో సినిమాటిక్స్ మేనేజ్‌మెంట్ తక్షణమే స్పందించి, సినిమా రంగానికి రావాలనుకునే వర్ధమాన నటీనటులను మరియు అభిమానులను హెచ్చరిస్తూ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. సోషల్ మీడియాలో చలామణి అవుతున్న 'RAPO23' కాస్టింగ్ కాల్ పోస్టర్లు పూర్తిగా నకిలీవని, వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. సినిమా అవకాశాల పేరిట సాగుతున్న ఇటువంటి మోసపూరిత ప్రకటనలను నమ్మి ఎవరూ మోసపోవద్దని, ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని ఆశపడే యువత అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రొడక్షన్ హౌస్ కోరింది.
ఈ అధికారిక ప్రకటనలో భాగంగా విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ లో స్పష్టమైన మార్గదర్శకాలను పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు లేదా ఫేక్ ఏజెంట్లు ఎవరైనా సినిమా ఆడిషన్స్ అంటూ మిమ్మల్ని సంప్రదిస్తే, వారికి మీ వ్యక్తిగత వివరాలను, ఫోటోలను ఎట్టిపరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దని మేకర్స్ విజ్ఞప్తి చేశారు.
#RAPO23 చిత్రానికి సంబంధించి ఎలాంటి అధికారిక కాస్టింగ్ కాల్స్ ఉన్నా, లేదా సినిమా షూటింగ్ మరియు నటీనటుల ఎంపికకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్స్ అయినా సరే, కేవలం తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మాత్రమే ప్రకటిస్తామని ప్రొడక్షన్ టీమ్ స్పష్టం చేసింది.




