
టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ (Satya Dev) హీరోగా, సెన్సిబుల్ డైరెక్టర్ వెంకటేశ్ మహా (Venkatesh Maha) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'రావు బహదూర్' (Rao Bahadur). గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.
జూన్ 5న గ్రాండ్ రిలీజ్
'రావు బహదూర్' సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వేసవి కానుకగా జూన్ 5న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ చిత్రానికి సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తన సొంత నిర్మాణ సంస్థ 'జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్' (GMB Entertainment) పతాకంపై సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం.
రాజవంశం నేపథ్యంతో సైకలాజికల్ డ్రామా
ఓ రాజవంశం నేపథ్యంతో సాగే 'సైకలాజికల్ డ్రామా'గా ఈ చిత్రాన్ని మలిచారు. ఇందులో సత్యదేవ్ విభిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారు. తాజా పోస్టర్‌లో సత్యదేవ్ ఒక అరిస్టోక్రాటిక్ అవతారంలో, గంభీరమైన ముద్రతో కనిపిస్తూ సినిమాపై అంచనాలను పెంచేశారు. ఈ పాత్ర కోసం సత్యదేవ్ తన మేకప్‌కే రోజుకు ఐదు గంటల సమయం కేటాయించాల్సి వచ్చేదట.
శ్రీ చక్ర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏ+ఎస్ మూవీస్, మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సత్యదేవ్ సరసన దీపా థామస్ హీరోయిన్‌గా నటిస్తోంది. స్మరణ్ సాయి సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద పోరు
జూన్ 4న కేజీఎఫ్ స్టార్ యశ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్' విడుదలవుతుండగా, మరుసటి రోజే (జూన్ 5) సత్యదేవ్ 'రావు బహదూర్' తో థియేటర్లలోకి రాబోతున్నారు. ఈ క్లాస్ అండ్ మాస్ సినిమాల పోరు బాక్సాఫీస్ వద్ద ఎలా ఉంటుందో చూడాలి.






