
మరి కొన్నిరోజుల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)తన నట విశ్వరూపాన్ని 'పెద్ది'(Peddi)తో సెల్యులాయిడ్ పై చాటనున్నాడు. ఈ మధ్య కాలంలో రిలీజ్ కి ముందే పెద్దికి వచ్చినంత పాజిటివ్ వైబ్రేషన్స్ మరో చిత్రానికి రాలేదనే చెప్పాలి. చరణ్ తో పాటు టీం మొత్తం ఇండియా వైడ్ గా ప్రమోషన్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న దేశ రాజధాని ఢిల్లీలో టీం ప్రత్యక్ష మయ్యింది.
ఈ ఈవెంట్ లో చరణ్ మాట్లాడుతు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)గారిని మర్యాదపూర్వకంగా కలిసాను. ఎంతో ఆప్యాయంగా పలకరించి 'పెద్ది' కథాంశం దేని గురించి అని ఆసక్తిగా అడిగారు. అప్పుడే నేను ఆయనతో 'సార్, ఈ సినిమా 'వికసిత్ భారత్' కాన్సెప్ట్‌కి అద్దం పట్టేలా ఉంటుంది. ముఖ్యంగా మన దేశంలోని గ్రామాల్లో ఉండే యువత సాధికారత, మట్టిలో మాణిక్యాల లాంటి ప్రతిభని వెలికితీసే ఒక అద్భుతమైన గిరిజన ప్రాంత యువకుడి కథ" అని చెప్పాను. దాంతో నా మాటలు విన్న ప్రధాని మోదీ ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో తనకు ఎదురైన ఒక అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన నిజ జీవిత సంఘటనని నాతో పంచుకున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని ఒక చిన్న గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు, అక్కడ ఉన్న చాలా మంది యువకులు ఫుట్‌బాల్ జెర్సీలు ధరించారు. ఆ గ్రామంలో అంతమంది ఫుట్‌బాల్ ఆడటానికి గల కారణాన్ని ఆరా తీయగా ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదే ప్రాంతానికి చెందిన 'మహమ్మద్' అనే ఒక సాధారణ వ్యక్తి ఎంతో కష్టపడి భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టుకి ఆడి, తన గ్రామానికి దేశవ్యాప్తంగా ఒక గొప్ప గుర్తింపుని తీసుకువచ్చాడు. అతనిని చూసి స్ఫూర్తి పొందిన ఆ గ్రామ యువత కూడా ఫుట్‌బాల్ వైపు అడుగులు వేశారు. ఆ ఒక్క వ్యక్తి చూపిన స్ఫూర్తి వల్ల ఈ రోజు ఆ చిన్న పల్లెటూరు నుండి ఏకంగా 85 మందికి పైగా యువకులు ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆడుతున్నారు. ఒక్క వ్యక్తి నిజాయితీగా అనుకుంటే సమాజంలో, ఒక గ్రామంలో ఎంతటి గొప్ప మార్పు తీసుకురావచ్చో చెప్పడానికి ఇదే నిదర్శనమని మోదీ సర్ నాతో చెప్పారని చరణ్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు పెద్ది రేంజ్ ని మరింతగా పెంచాయి.
also read: హీరోయిన్ ఛాన్స్ అంటూ ఘోర మోసం.. ఏం దోచుకున్నాడో తెలుసా!
మరోవైపు బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా సునామీ సృష్టిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా (US) మార్కెట్‌లో రామ్ చరణ్ తన గ్లోబల్ స్టార్ స్టామినాను మరోసారి నిరూపించుకుంటున్నారు. సినిమా విడుదలకు ఇంకా వారం రోజులకి పైగా సమయం ఉన్నప్పటికీ, యూఎస్‌లో కేవలం అడ్వాన్స్ సేల్స్ ద్వారానే సుమారు 17,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దీని ద్వారా 481.5K డాలర్ల వసూళ్లను సాధించింది. నార్త్ అమెరికా ప్రీమియర్ బుకింగ్స్ అన్నీ కలుపుకుంటే, ఇప్పటివరకు దాదాపు 18,900 టిక్కెట్లతో రూ. 4.4 కోట్లకు పైగా భారీ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది.






