
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan)సృష్టించే ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2025 సెప్టెంబర్ 25న విడుదలైన ‘దే కాల్ హిమ్ ఓజీ’ (They Call Him OG) చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్‌ని షేక్ చేయడమే కాకుండా, పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓజీ అభిమానులకి మరో భారీ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఓజీ 2’ (OG 2) రాబోతోందంటూ అధికారికంగా ప్రకటన విడుదలైంది. కేవలం సీక్వెల్ మాత్రమే కాకుండా, దీనిని ఒక భారీ ‘ఓజీ యూనివర్స్’ (OG Universe) గా విస్తరిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఓజీ మారుమోగిపోతోంది.
ఈ సరికొత్త ప్రాజెక్టును పవన్ కల్యాణ్ తన స్వంత బ్యానర్ అయిన ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ (PKCW) పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండటం విశేషం. దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. అందులో దర్శకుడు సుజీత్ ఈ కథకు సంబంధించిన కొన్ని కీలకమైన ఎలిమెంట్స్‌ను, ఐకానిక్ విజువల్స్ ఐడియాలను పవన్ కల్యాణ్‌కు వివరిస్తూ కనిపించారు. కథా చర్చల్లో భాగంగా సుజీత్ చెప్పిన కొన్ని పాయింట్స్ వింటుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. మంచు క్రమక్రమంగా రక్తంగా మారే ఒక అద్భుతమైన సీన్, అలాగే కథను మలుపు తిప్పే ఒక ‘అవుట్‌సైడర్’ క్యారక్టర్ గురించి, మొదటి భాగంలో పవన్ కల్యాణ్‌తో పాటు కనిపించిన పెంపుడు కుక్క ప్రాధాన్యత గురించి సుజీత్ ఈ వీడియోలో వివరించారు. ఈ కథా చర్చల్లో పవన్ కల్యాణ్ ఎంతో ఆసక్తిగా పాల్గొంటూ, సుజీత్ విజన్‌కు ఫిదా అయ్యారు. ఒకానొక సందర్భంలో ‘ఈ సీన్ మాత్రం స్క్రీన్‌పై అత్యంత ఐకానిక్ విజువల్ కాబోతోంది’ అని పవన్ కల్యాణ్ ప్రశంసించడం విశేషం.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నప్పటికీ, పవన్ కల్యాణ్ ఈ ప్రాజెక్ట్ పట్ల పూర్తి నిబద్ధతతో ఉన్నారు. దర్శకుడు సుజీత్‌తో మాట్లాడుతూ, ‘నీకు నా వైపు నుండి ఏం కావాలన్నా నేను సిద్ధంగా ఉన్నాను’ అని పవన్ కల్యాణ్ హామీ ఇవ్వడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రానికి ఎస్. థమన్ మరోసారి అద్భుతమైన సంగీతాన్ని అందించబోతున్నారు. ఓజీ మొదటి భాగంలో థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా విజయానికి ప్రధాన బలమన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రాబోయే ఓజీ యూనివర్స్‌లో ఓజాస్ గంభీర గతానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను, ముఖ్యంగా జపాన్‌తో అతనికి ఉన్న కనెక్షన్‌ని మరింత లోతుగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. జపనీస్ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ కొత్త అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పవన్ కల్యాణ్ సరికొత్త రగ్గడ్ లుక్ కూడా నెట్టింట వైరల్ అవుతూ రికార్డు వ్యూస్ సాధిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఓజీ తుఫాన్ బాక్సాఫీస్ వద్ద మరిన్ని సరికొత్త రికార్డులని సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.





