
‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కీర్తి సురేష్. ఆ సినిమా తర్వాత తెలుగులో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అలాంటి స్టార్ హీరోయిన్ నటించిన సినిమా ఇప్పుడు తెలుగులో విడుదలవుతుంటే కనీస బజ్ కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా? ‘సత్యవాన్ సావిత్రి’.
కీర్తి సురేష్, మిస్కిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కోర్టు డ్రామా నవంబర్ 20న తమిళంతో పాటు తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదలకు మరో రెండు రోజులే ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా గురించి పెద్దగా సందడి కనిపించడం లేదు.
నిజానికి ఈ సినిమా విడుదలవుతున్న విషయం కూడా చాలామందికి తెలియదు. అక్టోబర్‌లో టీజర్ విడుదల చేశారు. నవంబర్ 12న తమిళం, తెలుగు భాషల్లో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. కానీ ఆ ప్రమోషనల్ కంటెంట్ తెలుగు ప్రేక్షకుల్లో మాత్రం ఆశించిన స్థాయిలో చర్చకు రాలేదనిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ, సినిమా వర్గాల్లోనూ పెద్దగా బజ్ కనిపించడం లేదు.

ఒక స్టార్ నటించిన సినిమా విడుదలవుతోందంటే కనీసం ట్రైలర్ గురించి, కథ గురించి గురించి కొంతైనా చర్చ జరుగుతుంది. కానీ ‘సత్యవాన్ సావిత్రి’ విషయంలో అలాంటి వాతావరణం కనిపించడం లేదు. తెలుగులో ప్రమోషన్లు చేయకపోవడమే దీనికి ప్రధాన కారణమై ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది కూడా చదవండి: ఆకాశంలో ఒక తార vs డియర్ ఆస్ట్రోనాట్.. ఒకే రోజు ఒకే కథతో రెండు సినిమాలు.!
ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి అనే లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఆమెకు సీనియర్ లాయర్‌గా మిస్కిన్ నటిస్తున్నారు. ఒక హత్య కేసులో తన భర్తను కాపాడేందుకు సావిత్రి న్యాయపోరాటం చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఆమెకు తన సీనియర్ లాయర్‌తోనే ఎదురుపడే పరిస్థితి వస్తుంది. ఈ ఇద్దరి మధ్య జరిగే పోరాటమే సినిమా ప్రధాన కథాంశంగా ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
ప్రవీణ్ ఎస్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాల సరవణన్, చారుకేశ్, శిల్పా మంజునాథ్ తదితరులు నటించారు. సామ్ సీఎస్ సంగీతం అందించారు. డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.
మీకు నచ్చవచ్చు:
తొలి బిడ్డ రాక.. సమంత ఇంట్లో ప్రత్యేక పూజలు.. ఫ్యామిలీ ఫొటోలు వైరల్.!
సాత్విక వీరవల్లి.. ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే వరుస ఆఫర్లు.!
[Mahanati, Keerthy Suresh, Sathyavan Savithiri, No Buzz, Mysskin]






