Home

»

news

Nawab Cafe Movie Review : నవాబ్ కేఫ్ మూవీ రివ్యూ

Feb 20, 2026

తారాగణం: శివ కందుకూరి, తేజు అశ్విని, రాజీవ్ కనకాల, చైతన్య కృష్ణ, రాజ్‌కుమార్ కసిరెడ్డి, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి 
డీఓపీ: క్రాంతి వర్ల 
ఎడిటింగ్: పవన్ నరవ 
దర్శకత్వం: ప్రమోద్ హర్ష 
నిర్మాతలు: రాధా వి. పాపుడిప్పు, వెంకట్ ఆర్. పాపుడిప్పు
బ్యానర్: హర్షిక ప్రొడక్షన్స్ 
విడుదల తేదీ: ఫిబ్రవరి 20, 2026

శివ కందుకూరి, తేజు అశ్విని, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'నవాబ్ కేఫ్'(Nawab Cafe). ప్రమోద్ హర్ష దర్శకత్వంలో హర్షిక ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి మొదట అనుకున్న టైటిల్ 'చాయ్ వాలా'. సెన్సార్ అభ్యంతరంతో 'నవాబ్ కేఫ్'గా మారింది. విచిత్రంగా స్క్రీన్ మీద మాత్రం 'నవాబ్స్ కేఫ్' అని పడింది. సరే టైటిల్ విషయాన్ని పక్కన పెడితే.. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ఒక 'చాయ్ వాలా' కథగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే..?

కథ:
రాజా(శివ కందుకూరి) హైదరాబాద్ పాతబస్తీకి చెందిన యువకుడు. రాజా తాత అప్పట్లో చాయ్ పెట్టడంలో గొప్ప పేరు సంపాదిస్తాడు. అతని చాయ్ కి ఫిదా అయిన హైదరాబాద్ నవాబ్.. విలువైన భూములను రాసిస్తాడు. వాటాలో భాగంగా ఆ భూములను పెద్ద కొడుకు తీసుకోగా, చిన్న కొడుకైన రాజా తండ్రి రంగనాథ్(రాజీవ్ కనకాల) మాత్రం వారసత్వంగా నవాబ్ కేఫ్ ని తీసుకుంటాడు. రంగనాథ్ చాయ్ కి, నవాబ్ కేఫ్ కి ఎంతో క్రేజ్ ఉంటుంది. రాజాకి మాత్రం ఈ లైఫ్ నచ్చదు. 'చాయ్ వాలా' అని పిలిపించుకోవడం అసలు ఇష్టముండదు. అమెరికా వెళ్ళాలని, కోట్లకు కోట్లు సంపాదించాలని కలలు కంటుంటాడు. 

మరోవైపు రాజా పెదనాన్న కొడుకు కుమార్(చైతన్య కృష్ణ) కన్ను 'నవాబ్ కేఫ్'పై పడుతుంది. కోట్ల విలువ చేసే ఆ కేఫ్ స్థలాన్ని తీసుకొని, అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలి అనుకుంటాడు. అన్నయ్య కుమార్ సూచనతో 'నవాబ్ కేఫ్'ని అమ్మేసి, రిచ్ లైఫ్ బతకాలని రాజా నిర్ణయించుకుంటాడు. రాజా తీసుకున్న నిర్ణయంతో అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? తను ప్రాణంగా భావించే నవాబ్ కేఫ్ ని అమ్మడానికి రంగనాథ్ ఒప్పుకున్నాడా? నవాబ్ కేఫ్ చరిత్రలో కలిసిపోయిందా లేక చరిత్ర సృష్టించిందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
వారసత్వం, విలువలు అంటూ తండ్రి మడి కట్టుకొని కూర్చుంటే.. కొడుకు మాత్రం డబ్బు, రిచ్ లైఫ్ అంటూ గాలిలో మేడలు కడుతుంటాడు. ఒకానొక సమయంలో తండ్రి విలువ తెలుసుకొని కొడుకు రియలైజ్ అయ్యి.. తండ్రి బాటలోనే పయనిస్తాడు. ఈ తరహా కథలు ఇప్పటికే తెరపై ఎన్నో వచ్చాయి. 'నవాబ్ కేఫ్' కూడా అలాంటి కథే. పైగా ఇందులో 'ఇడ్లీ కడై', 'ఉస్తాద్ హోటల్', 'మిస్ ఇండియా' వంటి సినిమాల ఛాయలు కనిపిస్తాయి.

ఇష్టంగా, నిజాయితీగా చేస్తే ఏ పనిలోనైనా విజయం సాధిస్తామనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా చెప్పదలుచుకున్నాడు దర్శకుడు. మనం కోరుకునే జీవితం ఒకటైతే, మన తలరాత మరోలా ఉంటుంది. ఆ రెండింటి మధ్య నగిలిపోయే జీవితమే ఇందులో హీరో పాత్రది.

'నవాబ్ కేఫ్'ని పరిచయం చేస్తూ సినిమా ప్రారంభమవుతుంది. ఒత్తిడిలో ఉన్నవారికి తన చాయ్ ద్వారా కాస్త ఉపశమనం కలిగితే చాలు అనుకునే ఒక సాధారణమైన, స్వచ్ఛమైన మనిషిగా రంగనాథ్ పాత్రను పరిచయం చేశారు. ఇక అతని కొడుకు రాజా పాత్రను పెద్దగా బాధ్యతలు పట్టవు అన్నట్టుగా, రిచ్ లైఫ్ బతకాలని కలలు కంటున్నట్టు పరిచయం చేశారు. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు విసుగు తెప్పించాయి.

ఫస్ట్ హాఫ్ లో పేరుకి శివ కందుకూరి, రాజ్‌కుమార్ కసిరెడ్డి పాత్రల మధ్య కామెడీ సన్నివేశాలు ఉంటాయి కానీ.. అవి ఏమాత్రం నవ్వు తెప్పించవు. ఒక్క కామెడీ డైలాగ్ కూడా పేలలేదు. ఇక శివ కందుకూరి-తేజు అశ్విని మధ్య లవ్ ట్రాక్ కూడా మెప్పించలేదు. ఇంటర్వెల్ ముందే తండ్రీకొడుకుల మధ్య సంఘర్షణ మొదలవుతుంది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

సెకండ్ హాఫ్ లో సినిమా పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో ఏమాత్రం ఆకట్టుకొని కామెడీ సీన్స్, లవ్ సీన్స్ తో బోర్ కొట్టించే కంటే.. తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది. అప్పుడు సెకండ్ హాఫ్ లో ఎమోషన్ బాగా వర్కౌట్ అయ్యుండేది.

ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త బెటరే అయినప్పటికీ.. సన్నివేశాల్లో కొత్తదనం కనిపించదు. హీరో పాత్ర తాలూకు సంఘర్షణను కూడా అంత ప్రభావవంతంగా చూపించలేదు. పతాక సన్నివేశాలు ఊహించినట్టుగానే సాగుతాయి. పెద్దగా మెరుపులు ఉండవు.

ఓవరాల్ గా కథాంశం బాగానే ఉంది. కామెడీ, ఎమోషన్స్ కి స్కోప్ ఉంది. కానీ అవి పండలేదు. సెకండాఫ్ పరవాలేదు కానీ, ఫస్ట్ హాఫ్ మరీ విసిగించింది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
రాజా పాత్రలో శివ కందుకూరి బాగానే రాణించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో మెప్పించే ప్రయత్నం చేశాడు. తేజు అశ్విని పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఇక కథకు కీలకమైన రంగనాథ్ పాత్రను తన సీనియారిటీతో నిలబెట్టాడు రాజీవ్ కనకాల. చైతన్య కృష్ణ, రాజ్‌కుమార్ కసిరెడ్డి, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.

ప్రమోద్ హర్ష దర్శకుడిగా పెద్దగా ప్రభావం చూపలేదు. ఎమోషనల్ సీన్స్ తెరకెక్కించడంలో కొంతవరకు పరవాలేదు. రచన తేలిపోయింది. కథనాన్ని ఆసక్తికరంగా రాసుకోవడం, సన్నివేశాల్లో కొత్తదనం ఉండేలా చూసుకోవడంపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా సంభాషణలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. సెకండాఫ్ లో డైలాగ్స్ కొంతవరకు పర్లేదు కానీ, ఫస్ట్ హాఫ్ లో మరీ సిల్లీగా ఉన్నాయి.

క్రాంతి వర్ల కెమెరా పనితనం బాగానే ఉంది. పాతబస్తీ వాతావరణాన్ని, చార్మినార్ చుట్టుపక్కల అందాన్ని తన కెమెరాలో చక్కగా బంధించాడు. ప్రశాంత్ ఆర్. విహారి మ్యూజిక్ మ్యాజిక్ చేయలేకపోయింది. పాటలు పూర్తిగా తేలిపోయాయి. ఎడిటర్ పవన్ నరవ కత్తెరకు ఇంకా చాలా పని చెప్పవచ్చు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:
కథాంశం
ఇంటర్వెల్ 
సెకండాఫ్ లో కొన్ని సీన్స్

మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్
డైలాగ్స్

ఫైనల్ గా..
ఒక మంచి చాయ్ పెట్టడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. కానీ, రుచికరమైన చాయ్ ని మాత్రం అందించలేకపోయారు.

రేటింగ్: 2.25/5

Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com