నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. సీనియర్ నటుడు మోహన్‌బాబు పోషించిన పాత్రపై కూడా ఆసక్తి నెలకొంది.
తాజాగా తన పాత్ర గురించి మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రస్తావన రావడంతో తన పాత్ర గురించి ఆసక్తికరంగా స్పందించారు.
విద్యార్థులు తనకు కరతాళ ధ్వనులతో స్వాగతం పలకడంతో.. ఈ చప్పట్లు బహుశా ‘ది ప్యారడైజ్’ సినిమా కోసమే అనుకుంటున్నానని మోహన్‌బాబు సరదాగా అన్నారు. ఆ సినిమా చూసిన తర్వాత తన దగ్గరకు రావడానికి కూడా ఎవరూ సాహసించరని, తన పాత్ర అంత భయంకరంగా ఉంటుందని నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీంతో సినిమాలో మోహన్‌బాబు ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారనే ఆసక్తి మరింత పెరిగింది.
‘ది ప్యారడైజ్’లో మోహన్‌బాబు పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన పోషిస్తున్న పాత్ర పేరు శిఖంజ్ మాలిక్ అని సమాచారం. ఈ పాత్ర సినిమాకు చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఇప్పటివరకు ఆయన పోషించిన పాత్రలకు భిన్నమైన షేడ్స్ ఇందులో కనిపించే అవకాశం ఉంది.
మరోవైపు ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ అయింది. దాదాపు మూడు గంటల నిడివితో ఈ సినిమా తెరకెక్కగా.. హింసాత్మక సన్నివేశాల కారణంగా సెన్సార్ బోర్డు పలు మార్పులు, కట్స్ సూచించినట్టు సమాచారం. మొత్తం 21 చోట్ల మార్పులు చేయాలని సీబీఎఫ్‌సీ సూచించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించారు. మోహన్‌బాబుతో పాటు రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
ఇప్పటికే ‘ఏ’ సర్టిఫికెట్, దాదాపు మూడు గంటల రన్‌టైమ్, భారీ యాక్షన్ సన్నివేశాల కారణంగా ‘ది ప్యారడైజ్’పై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు మోహన్‌బాబు తన పాత్ర గురించి చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. మరి తెరపై ఆయన పాత్ర ఏ స్థాయిలో భయపెడుతుందో తెలియాలంటే సెప్టెంబర్ 24 వరకు ఆగాల్సిందే.
[Mohan Babu, The Paradise, The Paradise Movie, Nani The Paradise, Mohan Babu The Paradise, Mohan Babu Villain Role, Shikhanj Malik, Nani Movie, Srikanth Odela, The Paradise Release Date, The Paradise A Certificate, Anirudh Ravichander, Nani Mohan Babu, Telugu Cinema News]




