టాలీవుడ్ దివంగత నటుడు, రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి సరికొత్త యాక్షన్ ప్యాక్డ్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘స్టూడెంట్’. విలక్షణమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. సోషల్ మీడియాలో ఈ సరికొత్త లుక్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఈ ఇంటెన్స్ పోస్టర్‌లో మేఘాంశ్ శ్రీహరి ఊరమాస్ అవతారంలో మెరిశారు. ఒక సాధారణ విద్యార్థి జీవితంలో ఉండే విభిన్న కోణాలను ప్రతిబింబించేలా ఈ పోస్టర్‌ను చాలా క్రియేటివ్‌గా డిజైన్ చేశారు. పవర్ స్టార్ సినిమా బ్యానర్లు కట్టడం, కాలేజీ క్లాస్ రూమ్‌లోని జామెట్రీ బాక్స్ డివైడర్‌ను చదువుకు కాకుండా గొడవల్లో ఆయుధంగా వాడటం, కాలిపోయిన సిగరెట్ ముక్కలు, ప్రేమలేఖలు వంటి ఎలిమెంట్స్‌ను ఈ పోస్టర్‌లో చూపించి సినిమాపై అంచనాలను పెంచేశారు.
పోస్టర్‌పై ఉన్న డైలాగ్స్ కూడా సినిమాలోని యాక్షన్, లవ్ ఎలిమెంట్స్‌ను హింట్ ఇస్తున్నాయి. “ధైర్యం ఉన్నవాడే తన వెంట అందరూ నడిచేలా చేసుకుంటాడు” అనే కొటేషన్ హీరో క్యారెక్టరైజేషన్‌లోని సాహసాన్ని చూపిస్తుండగా.. “ఈ భాను గాడు అంతా చూసుకుంటాడు, నువ్వు లవ్ చేయి; తన్మయి లవ్స్ భాను” అనే లైన్స్ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే బలమైన ప్రేమకథను సూచిస్తున్నాయి. చిత్రంలో మేఘాంశ్ సరసన విజేత పరీక్ హీరోయిన్‌గా నటిస్తోంది.
గతంలో 'రాజ్‌దూత్', 'కోతి కొమ్మచ్చి' వంటి చిత్రాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మేఘాంశ్.. ఈసారి పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్‌తో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. బాలు తత్వమసి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను జోవికా సినిమాస్, చెరిష్ మీడియా వర్క్స్ పతాకాలపై బెల్లం సిద్ధారెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బెల్లం సంతోష్, బెల్లం బయ్యారెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇక ఈ సరికొత్త లుక్ చూసిన నందమూరి, మెగా, ఇంకా రియల్ స్టార్ శ్రీహరి అభిమానులు సోషల్ మీడియాలో పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. తండ్రికి తగ్గ వారసుడిగా మేఘాంశ్ ఈ సినిమాతో గట్టి కంబ్యాక్ ఇవ్వడం ఖాయమని, ఈ 'మెంటల్ మాస్ తుఫాన్' బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుందని కామెంట్స్ పెడుతున్నారు. టాలీవుడ్ సర్కిల్స్‌లో కూడా ఈ ఫస్ట్ లుక్ మంచి బజ్ క్రియేట్ చేసింది.
ఈ ‘స్టూడెంట్’ చిత్రం మేఘాంశ్ శ్రీహరి కెరీర్‌లోనే ఒక ల్యాండ్‌మార్క్ మూవీగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా ఎక్కడా రాజీ పడకుండా దీపక్ భూపతి ఆధ్వర్యంలో వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టీజర్, ట్రైలర్ మరియు రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్స్ త్వరలోనే మేకర్స్ అధికారికంగా వెల్లడించనున్నారు.




