సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ తనదైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయనతో ఒక్క సినిమా అయినా తెరకెక్కించాలని ఎంతోమంది దిగ్గజ దర్శకులు ఎదురుచూస్తుంటారు.
ఇండియన్ సినిమా హిస్టరీలోనే టాప్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చకున్న శంకర్ కూడా మహేష్ బాబుతో కాంబినేషన్ సెట్ చేసుకోవాలని పలుమార్లు ప్రయత్నించారు. అయితే ఈ కాంబో రెండుసార్లు అనౌన్స్‌మెంట్ దాకా వచ్చి ఆగిపోయిందనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సమాచారం ప్రకారం, 'పోకిరి' సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సమయంలో శంకర్ ఒక విభిన్నమైన లవ్ స్టోరీతో మహేష్ బాబును కలిశారట. కానీ ఆ కథాంశం తగినంతగా ఆకట్టుకోకపోవడంతో మహేష్ బాబు ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత బాలీవుడ్ సూపర్‌హిట్ '3 ఇడియట్స్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని శంకర్ భావించినప్పుడు కూడా మొదటి ఛాయిస్ మహేష్ బాబే. ఈ సినిమాలో మహేష్ నటిస్తున్నట్టు అప్పట్లో ఎనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. అయితే ఊహించని విధంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు మహేష్. కెరీర్ ప్రారంభం నుండి రీమేక్ సినిమాల పట్ల ఆసక్తి చూపని మహేష్, ఆ భారీ ప్రాజెక్ట్‌ను నైస్‌గా స్కిప్ చేశారు. ఆ తర్వాత అదే చిత్రం 'స్నేహితుడు'గా వచ్చి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోయింది.
మామూలుగా శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ ఛాన్స్ ఇస్తే ఏ హీరో అయినా పచ్చజెండా ఊపేస్తారు. కానీ మహేష్ బాబు మాత్రం కేవలం కాంబినేషన్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా, కథ, తన పాత్ర ప్రాధాన్యతను మాత్రమే నమ్ముతారనే దానికి ఈ సంఘటన ఉదాహరణగా నిలిచింది.
ఈ క్రేజీ కాంబో మిస్ అవ్వడంపై సోషల్ మీడియాలో అభిమానులు ఆసక్తికరంగా చర్చిస్తున్నారు. అప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కి ఉంటే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదయ్యేవని ఫ్యాన్స్ భావిస్తుండగా, మహేష్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం శంకర్ సరైన హిట్ లేక వరుస ప్రాజెక్ట్‌లతో సతమతమవుతుండగా, మహేష్ బాబు మాత్రం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళితో కలిసి అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న గ్లోబల్ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించారు. ఈ భారీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి చరిత్ర సృష్టిస్తుందో చూడాలి.
[Mahesh Babu, Shankar, Mahesh Babu Shankar Movie, Tollywood Gossips, SSRMB]






