
-సినిమా పేరు: మహాశక్తి
నటీనటులు: నయనతార, రెజీనా, దునియా విజయ్, సునీల్, గరుడ రామ్, ఊర్వశి , యోగిబాబు తదితరులు
-సినిమాటోగ్రఫీ: గోపి అమర్ నాధ్
-ఎడిటింగ్: ఫెన్నీ ఒలివర్
-మ్యూజిక్: హిప్ హాప్ తమిళ
-నిర్మాతలు: ఇసారి కె గణేష్, ఖుష్బూ సుందర్,
-బ్యానర్: వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ లిమిటెడ్
-రచన,దర్శకత్వం: సుందర్ సి
-రిలీజ్ డేట్ : నవంబర్ 6 2026
లేడీ సూపర్ స్టార్ నయనతార, అగ్ర దర్శకుడు సుందర్ కాంబోలో తెరకెక్కిన మహాశక్తి (తమిళ్ లో మూక్కుతి అమ్మన్ 2 ) ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2020 లో వచ్చిన హిట్ బొమ్మ అమ్మోరు తల్లి ( తమిళంలో ‘మూకుత్తి అమ్మన్’) కి సీక్వెల్. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
శక్తి( నయనతార) పోలీస్ హోమ్ గార్డ్. నెమ్మదస్తురాలితో పాటు చిన్నసైజు భయస్తురాలు. నైట్ నిద్రపోయే సమయంలో చేతిలో కత్తితో గుర్రంపై ఒక వ్యక్తి వచ్చి 'మైలాంచి' అనే విలేజ్ రమ్మని ఆవేశపూరితమైన వాక్కుతో చెప్తుంటాడు.శక్తి పెంపుడు తల్లి బాలమ్మ( ఊర్వశి)కి కూడా ఆ విధంగా కనిపిస్తుండటంతో పాటు మాటలు వినిపిస్తూ ఉంటాయి. బైరా( రెజీనా కసాండ్రా) రెండువేల సంవత్సరాల క్రితం తనంతట తానుగా సజీవ సమాధి అవుతుంది. అలాంటి బైరా మళ్ళీ రెండు వేల సంవత్సరాలకి ఆశ్వయుజ మాసం, అష్టదశమి వేళ తొమ్మిది గ్రహాలు ఒకే కక్ష్యలోకి వచ్చే కొన్ని రోజుల ముందు పునరుజ్జీవం పొందుతుంది. శక్తిని అంతమొందించడానికి చూస్తుంటుంది. శక్తిని బైరా ఎందుకు టార్గెట్ చేసింది? రెండువేల సంవత్సరాల క్రితం సజీవ సమాధి అయ్యి మళ్ళీ ఇప్పుడు రావడానికి కారణం ఏంటి? శక్తి ఎవరు? శక్తి, బైరాకి మధ్య ఏంటి సంబంధం? అసలు రెండువేల సంవత్సరాల క్రితం ఏం జరిగింది? దానికి ఇప్పుడు ఇచ్చిన ముగింపు ఏంటి అనేదే మహాశక్తి.
ఎనాలసిస్
ఈ మధ్య కాలంలో ప్రస్తుత జనరేషన్ మెంటాలిటీకి డివోషనల్ డ్రామా జోడించి సినిమాలు రావడం చాలా తగ్గిపోయాయి. అలాంటి ఈ టైంలో మేకర్స్ చాలా డేర్ గా మహాశక్తిని తెరకెక్కించారు. డైరెక్షన్, ఆర్ ఆర్, గ్రాఫిక్స్ విషయంలో సైతం భారీగా సక్సెస్ అయ్యారు. కాకపోతే అవసరం లేని చోట కూడా గ్రాఫిక్స్ ఉపయోగించడం కొంచం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. కాకపోతే గ్రాఫిక్స్ పై పెట్టిన శ్రద్ద కథనం విషయంలో చూపించలేదు. ఉదాహరణకి సినిమా స్టార్టింగ్ లో చాలా దేవాలయాల దగ్గర అనుకోని ప్రమాదాలు జరిగి భక్తులు చనిపోతున్నారని ఒక మహా పండితుడు బాధపడతాడు. ఆ తర్వాత తన రహస్య గ్రంధాల ద్వారా అదంతా ఒక సైతాన్ సృషించే విధ్వంసం అని తెలుసుకుంటాడు.
ఈ పాయింట్ నే కథ ఆత్మగా చేసుకొని సెకండ్ హాఫ్ లో యాజ్ టిజ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటే సినిమా రేంజ్ మరోలా ఉండేది.ఆ విధంగా కాకుండా అనవసరమైన ట్రాక్ ని ఎక్కువగా తగిలించుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో మొదటి 15 నిముషాలు బాగానే ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన సీన్స్ అన్ని తేలిపోయాయి. భయాన్ని మైంటైన్ చేస్తూ ఉండే శక్తి(నయనతార) రహస్యాలని తెలుసుకోవాలని ఎలా అనుకుంటుంది. కాబట్టి శక్తిని దైర్యవంతురాలిగానే ఎస్టాబ్లిష్ చేసుండాల్సింది. సునీల్, దునియా విజయ్ మధ్య వచ్చిన సీన్స్ తో పాటు క్షుద్రశక్తులు గల గరుడ రామ్ నరబలులు ఇస్తుండటం, తన కొడుకుని చంపినందుకు శక్తి పై పగ పెంచుకోవడం ఎపిసోడ్ కూడా బాగుంది. బైరా(రెజీనా) ఎంట్రీ సీన్ అయితే సూపర్.. మూవీపై ఇంట్రెస్ట్ కూడా కలిగించింది.
కానీ ఆ తర్వాత వచ్చిన సీన్స్ రొటీన్ . యోగబాబు కామెడీ పేలలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది.సెకండ్ హాఫ్ లో చూసుకుంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంది. కాకపోతే బైరా, ప్రస్తుత యువరాజు,కాబోయే రాజు(దునియా విజయ్) ట్రాక్ పెద్దగా సెట్ అవ్వలేదు. మహాశక్తి(నయనతార) అమ్మవారి ట్రాక్ ని కూడా బైరా ట్రాక్ కి సమానంగా ఎస్టాబ్లిష్ చేసుండాల్సింది. పోరాట సన్నివేశాలు పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. పెళ్లి ఎపిసోడ్ వేస్ట్.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సైతం సింపుల్ గా తేల్చిపడేసినట్టుగా ఉంది.
నటీనటులు సాంకేతిక నిపుణల పని తీరు
శక్తి , మహాశక్తి గా నయనతార మరో సారి తన పెర్ఫార్మ్ తో మెస్మరైజ్ చేసింది. కాకపోతే శక్తి గా ఉన్నప్పుడు తన ఫేస్ మొత్తం డల్ గా కనిపించింది. అది కూడా నటనలో ఒక భాగమైతే అని మాత్రం అనుకోలేం. ఫేస్ లో డల్ నెస్ కనపడిందనేది మాత్రం పక్కా.బైరా( రెజీనా కాసాండ్రా) ఒక రేంజ్ పెర్ఫార్మ్ చేసింది. పలు రకాల క్యారక్టర్ లని సృష్టించుకునే పాన్ ఇండియా మేకర్స్ తమ పరిశీలనలోకి రెజీనా ని కూడా తీసుకుంటారు. అంతలా తన పెర్ఫార్మ్ తో మెస్మరైజ్ చేసి పడేసింది దునియా విజయ్ కూడా అంతే . మేకర్స్ పెట్టుకున్న నమ్మకానికి ఒకటికి పదింతలు న్యాయం చేసాడు మిగతా క్యారెక్టర్స్ లలో చేసిన సునీల్, గరుడ రామ్ తో పాటు అందరూ తమ క్యారక్టర్ తగ్గ పెర్ఫార్మ్ చేశారు. హిప్ హాఫ్ తమిళ ఆర్ ఆర్ ఒక రేంజ్ లో ఉంది. సినిమాకి ప్రాణంగా కూడా నిలిచింది. ఫొటోగ్రఫీ కూడా అంతే . సూపర్.. దర్శకుడిగా సుందర్ ఎప్పటిలాగానే స్క్రిప్ట్ తో చెడుగుడు ఆడుకున్నాడు. గ్రాఫిక్స్ కి సంవత్సరాలకి సంవత్సరాలే పడుతున్న ఈ రోజుల్లో చాలా తక్కువ సమయంలోనే గ్రాఫిక్స్ తో కూడా షేక్ చేసి పడేసాడు. కథనం విషయంలో మాత్రం పెద్దగా మెప్పించలేకపోయాడు. నిర్మాణ విలువలు తగ్గేదేలే అనే విధంగా ఉన్నాయి.
బలాలు
1 . కథ
2 . డైరెక్షన్
3 . నయనతార, రెజీనా పెర్ఫార్మెన్స్
బలహీనతలు
1 . ఆకట్టుకొని కథనం
చివరిగా చెప్పాలంటే డివోషనల్ చిత్రాలని ఇష్టపడే వాళ్ళకి 'మహాశక్తి' నచ్చవచ్చేమో.
రేటింగ్ 2 .25 /5
అరుణాచలం






