Home

»

Latest News

టైటిల్ కోసం 112 కోట్లు డిమాండ్‌..  LIK మూవీ డైరెక్ట‌ర్ బ‌య‌ట‌పెట్టిన నిజాలు!

Apr 15, 2026

ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా ఇటీవ‌ల త‌మిళ్‌, తెలుగు భాష‌ల్లో విడుద‌లైన ల‌వ్ ఇన్సూరెన్స్ కంపెనీ(LIK) ప్రేక్ష‌కుల్ని ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. అయితే ఈ సినిమా నిర్మాణానికి సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ ఒక ఇంట‌ర్వూలో వెల్ల‌డించారు. 

ఈ  సినిమా టైటిల్ విషయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ చిత్రానికి మొదట 'ఎల్ఐసీ' (LIC) అని పేరు పెట్టాలని దర్శకుడు భావించారు. అయితే, ఇదే పేరుతో ఇన్సూరెన్స్ రంగంలో దిగ్గజ సంస్థగా ఉన్న 'ఎల్ఐసీ' నుండి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ పేరును వాడుకోవాలంటే ఏకంగా 112 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆ సంస్థ డిమాండ్ చేసిందట. ఒక సినిమా బడ్జెట్ కంటే టైటిల్ కోసమే ఇంత భారీ మొత్తం అడగడంతో విఘ్నేష్ శివన్ వెనక్కి తగ్గి, స్పెల్లింగ్‌లో మార్పు చేస్తూ 'ఎల్ఐకే' (LIK) గా టైటిల్ ఖరారు చేశానని వివరించారు.

సినిమా నిర్మాణ ప్రయాణం కూడా పూలబాటలా సాగలేదని విఘ్నేష్ తెలిపారు. తొలుత ఈ ప్రాజెక్ట్‌ను లోకనాయకుడు కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ 'రాజ్ కమల్ ఇంటర్నేషనల్'లో దాదాపు 210 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేశారట. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సంస్థ తప్పుకోవడంతో బడ్జెట్‌ను గణనీయంగా తగ్గించాల్సి వచ్చింది. ఆ తర్వాత మరో ఇద్దరు నిర్మాతలు మారినా, చివరకు ఫైనాన్స్ సమస్యలు ఎదురుకావడంతో షూటింగ్ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందట.

ఇలాంటి క్లిష్ట సమయంలో విఘ్నేష్ భార్య, లేడీ సూపర్ స్టార్ నయనతార రంగంలోకి దిగి ఈ ప్రాజెక్ట్‌ను నిలబెట్టారు. 'మూకుత్తి అమ్మన్-2' సినిమా కోసం ఆమెకు అందిన భారీ అడ్వాన్స్ మొత్తాన్ని తన భర్త సినిమా కోసం కేటాయించినట్లు సమాచారం. ఎక్కడా రాజీ పడకుండా అనుకున్న విధంగా సినిమా పూర్తి చేయాలని ఆమె ఇచ్చిన భరోసాతోనే ఈ చిత్రం పూర్తయిందని విఘ్నేష్ ఎమోషనల్ అయ్యారు. చివరకు 100 కోట్ల లోపు బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

'లవ్ టుడే' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రదీప్ రంగనాథన్ నటించిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ విడుదల తర్వాత ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోతోంది. ముఖ్యంగా తెలుగులో ఈ చిత్రం అంతగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. అయినప్పటికీ, విఘ్నేష్ శివన్ - ప్రదీప్ రంగనాథన్ కాంబోలో వచ్చిన ఈ వెరైటీ కాన్సెప్ట్‌కు యూత్ నుండి కొంత మేర పాజిటివ్ స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com