వెండితెరపై మెరిసే రంగుల ప్రపంచం వెనుక ఎన్నో చీకటి కోణాలు ఉంటాయని తరచూ వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా 'కాస్టింగ్ కౌచ్' అనే పదం ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. తాజాగా వెర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒకప్పుడు తాను స్వయంగా కళ్లారా చూసిన ఓ భయంకరమైన సంఘటనను గుర్తు చేసుకుంటూ జేడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. తాను కెరీర్ ఆరంభంలో విలన్ పాత్రలు చేస్తున్న సమయంలో జరిగిన ఒక ఇన్సిడెంట్‌ను వివరించారు. అప్పట్లో ఒక టాప్ హీరోయిన్ తనకు, మరో నటుడు సురేష్‌కు మంచి స్నేహితురాలు. ఒకరోజు ఆమె మమ్మల్ని తన గెస్ట్ హౌస్‌కు భోజనానికి ఆహ్వానించింది. ముగ్గురం కలిసి సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో అనుకోకుండా ఎవరో డోర్ కొట్టారు. బయట ఉన్న వ్యక్తిని చూడగానే ఆ హీరోయిన్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. భయంతో వణికిపోతూ ఎలాగైనా కాపాడమని మమ్మల్ని వెంటనే మంచం కింద దాక్కోమని ప్రాధేయపడింది.
వేరే దారి లేక జేడీ చక్రవర్తి, సురేష్ ఇద్దరూ మంచం కింద దాక్కున్నారు. లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి వారు షాక్‌కు గురయ్యారు. వయసులో ఆ హీరోయిన్‌కు తాత అంత ఉండే ఓ ముసలి నిర్మాత అక్కడికి వచ్చాడు. కనీసం సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి, ఆ హీరోయిన్‌తో ప్రవర్తించిన తీరు అత్యంత అసభ్యకరంగా ఉందని జేడీ ఆవేదన వ్యక్తం చేశారు. మంచం కింద ఉన్న తమకు పైన జరుగుతున్న సంభాషణలు విని ఒళ్లు గగుర్పొడిచిందని, ఒక స్టార్ హీరోయిన్ ఇలాంటి పరిస్థితుల్లో ఉందా అని ఆశ్చర్యపోయామని ఆయన తెలిపారు.
ఆ నిర్మాత వెళ్లిన తర్వాత మంచం కింద నుంచి బయటకు వచ్చిన జేడీ, సురేష్‌ల కళ్లలో నీళ్లు తిరిగాయట. కానీ ఆ హీరోయిన్ మాత్రం ఏమీ ఎరగనట్టుగా నవ్వుతూ కనిపించింది. "వాడు ముసలోడు.. వాడి దగ్గర భరించలేని వాసన వస్తుంది. కానీ ఏం చేస్తాం? వాడు పెద్ద ప్రొడ్యూసర్. ఈ ఫీల్డ్ లో కొనసాగాలంటే ఇలాంటివి భరించక తప్పదు" అని ఆమె నవ్వుతూనే తన బాధను వెళ్లగక్కిందని జేడీ గుర్తు చేసుకున్నారు. అవకాశాల కోసం, కెరీర్ కోసం ఇష్టం లేకపోయినా ఇలాంటి దారుణాలను భరించాల్సి వస్తుందని ఆయన కుండబద్దలు కొట్టారు.
జేడీ చక్రవర్తి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆ హీరోయిన్ ఎవరై ఉంటారా అని ఆరా తీస్తున్నారు. రామ్‌గోపాల్‌వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, 'శివ' సినిమాతో సంచలనం సృష్టించిన జేడీ, ఇప్పటికీ తనదైన శైలిలో సినిమాలు చేస్తూనే ఉన్నారు. గతంలో కూడా ఆయన ఇండస్ట్రీలోని పలు సున్నితమైన అంశాలపై నిర్మొహమాటంగా మాట్లాడి వార్తల్లో నిలిచారు.
ప్రస్తుతం జేడీ చక్రవర్తి పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన చేసిన ఈ లేటెస్ట్ కామెంట్స్ ఇండస్ట్రీలో ఉండే పవర్‌ఫుల్ వ్యక్తుల ఆగడాలను మరోసారి ఎత్తిచూపాయి. మరి ఈ వివాదంపై ఇతర సినీ ప్రముఖులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు మారాలని, మహిళా నటీమణులకు రక్షణ ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.





