Home

»

Latest News

జయం రవి ఇంట్లో పోలీసుల సోదాలు.. అసలు ఏం జరిగిందంటే?

Jun 24, 2026 4:14PM

తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో జయం రవి (రవి మోహన్) చుట్టూ ఇప్పుడు ఒక సరికొత్త వివాదం ముసురుకుంది. ఆయన వ్యక్తిగత జీవితంలో ఇప్పటికే పలు ఒడిదొడుకులు నడుస్తుండగా, తాజాగా చెన్నైలోని ఆయన నివాసంలో పోలీసులు విచారణ జరపడం కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తన ఇంట్లో పనిచేసే సిబ్బందిని అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణలు రావడం ఈ వివాదానికి కారణమైంది.

అసలు విషయానికి వస్తే.. జయం రవి తన ఇంట్లో పనిచేసే ఇద్దరు సహాయకులతో పాటు ఒక మైనర్ బాలుడిని బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధంలో ఉంచారంటూ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన నీలాంకరై పోలీసులు చెన్నైలోని ఆయన నివాసానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. అయితే ఈ ఆరోపణలను నటుడి తరపు వర్గాలు పూర్తిగా ఖండించాయి.

తమ ఇంట్లో కొంతకాలంగా జరుగుతున్న దొంగతనం విషయమై నిజాలు రాబట్టేందుకే సదరు సిబ్బందిని ప్రశ్నిస్తున్నామని జయం రవి తరపున లాయర్లు, ప్రతినిధులు వెల్లడించారు. ఈ క్రమంలోనే హీరో జయం రవి కూడా పోలీసులకు ఎదురు ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో చోరీ జరిగిందని ఆయన పేర్కొనడంతో పోలీసులు కమ్యూనిటీ సర్వీస్ రిజిస్టర్ (CSR) నమోదు చేశారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని పోలీసులు ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

గత కొంతకాలంగా జయం రవి పర్సనల్ లైఫ్ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా తన భార్య ఆర్తీ రవితో విడాకుల వ్యవహారం ఏడాది కాలంగా కోర్టు మెట్లు ఎక్కి సాగుతోంది. ఈ వ్యక్తిగత మానసిక ఒత్తిడి కారణాల వల్లే ఆయన సినిమాలకు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ ఆయన లైనప్ మాత్రం భారీగానే ఉంది.

ప్రస్తుతం జయం రవి స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ‘యాన్ ఆర్డినరీ మ్యాన్’ చిత్రంతో పాటు, స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లో భాగమైన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘బెంజ్’ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సడన్‌గా ఇలాంటి లీగల్ ఇష్యూస్ తెరపైకి రావడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ తాజా ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. జయం రవి లాంటి కూల్ అండ్ ప్రొఫెషనల్ హీరో ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం నమ్మశక్యంగా లేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కేసులో పోలీసులు ఎవరినీ అరెస్ట్ చేయలేదని, ఇరువర్గాల వాదనలను పరిశీలిస్తూ లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. ఈ వివాదం నుంచి జయం రవి ఎలా బయటపడతారో, తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌ను ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com