
'మసూద', 'పరేషాన్', 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరో తిరువీర్ (Thiruveer), ఇప్పుడు సరికొత్త రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. తిరువీర్ హీరోగా, స్టార్ యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం 'ఓ సుకుమారి' (Oh Sukumari). గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా మేకర్స్ ఈ సినిమా అఫీషియల్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటూ, సినిమాపై ఆసక్తిని పెంచేసింది.
రెండు నిమిషాల నిడివితో ఉన్న ఈ టీజర్.. ఎంతో హిలేరియస్‌గా, ఆడియన్స్‌కు ఒక క్రేజీ రైడ్ లాంటి అనుభూతిని ఇస్తోంది. టీజర్ ప్రారంభంలో "దేవుడు మన దగ్గర నుండి ఏదైనా తీసుకున్నాడంటే ఇంకేదో గొప్పది ఇవ్వబోతున్నాడని దాని అర్థం" అంటూ సాగే ఎమోషనల్ డైలాగ్‌తో కథ లోపలికి తీసుకెళ్లారు. సినిమాలో తిరువీర్ ఒక సాదాసీదా గ్రామీణ యువకుడిగా, రాజకీయాల్లో ఎదగాలని ఆశపడే కాబోయే పొలిటీషియన్‌గా కనిపిస్తున్నారు. తన చుట్టూ పెద్ద ప్రతిపక్షం ఉన్నప్పటికీ, అవన్నీ పక్కన పెట్టి తనకు కాబోయే భార్య మాత్రం ఎంతో అందంగా, సున్నితంగా, పద్ధతిగా ఉండాలని కలలు కంటూ ఉంటాడు. "మంచి పిల్లని చూడు బాబాయ్ నేను లగ్గం చేసుకుంటా.. సూసుడితోటే కరెంట్ వాకినట్టు ఒల్లంతా పులకరింతలు రావాలి.. సుకుమారంగా ఉండాలి.. సుకుమారి లెక్క ఉండాలి" అంటూ హీరో చెప్పే తెలంగాణ యాస డైలాగ్స్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
కథలో అసలు ట్విస్ట్ హీరోయిన్ సుకుమారి ఎంట్రీతో మొదలవుతుంది. హీరో అనుకున్నట్లుగానే ఎంతో పద్ధతిగా ఉండే సుకుమారిని చూసి చూడగానే ప్రేమలో పడిపోతాడు. అయితే, సుకుమారి తండ్రి హీరోకి ఒక పెద్ద రహస్యాన్ని దాచిపెడతాడు. "దామినికి ఒక చిన్న సమస్య ఉన్నది", "మనమేమి ఇక్కడ నూరు అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తలేం, ఒక్కటే ఒక్క నిజం దాచి పెట్టి చేస్తున్నాం అంతే" వంటి డైలాగ్స్ కథలో ఉన్న సస్పెన్స్ అండ్ ఫన్ ఎలిమెంట్‌ను హైలైట్ చేశాయి. ఇక పెళ్లి పీటల వరకు వచ్చిన కథలో అసలు ట్విస్ట్ వస్తుంది. హీరోయిన్ ను ముట్టుకోగానే హీరోకి షాక్ కొడుతుంది. మరి ఆ షాక్ వెనుకున్న కథ ఏంటో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.
ఈ సినిమాలో తిరువీర్ నటన, ఆయన పలికించిన హావభావాలు, స్క్రీన్ ప్రెజెన్స్ విలేజ్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు వంద శాతం న్యాయం చేశాయి. ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్‌ను టీజర్‌లో ఎక్కువగా రివీల్ చేయనప్పటికీ, ఆమె ఎక్స్‌ప్రెషన్స్ పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. థియేటర్లలో ప్రేక్షకులకు ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నామని 'ఓ సుకుమారి' టీజర్ ద్వారా చిత్ర బృందం గట్టి నమ్మకాన్ని ఇచ్చింది.





