
ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘ఫౌజీ’ అప్డేట్ వచ్చేసింది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలవుతుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే అది సాధారణ టీజర్ కాదని, సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసే ప్రత్యేక వీడియో అని నిర్మాత మైత్రి రవిశంకర్ స్పష్టం చేశారు.
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు సినిమా నుంచి పెద్దగా ప్రచార కంటెంట్ బయటకు రాకపోవడంతో అభిమానులు అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ‘దొంగ నా కొడుకు’ సినిమా ఈవెంట్లో పాల్గొన్న మైత్రి రవి.. ‘ఫౌజీ’ అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘ఫౌజీ’ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ కానుందని తెలిపారు. అయితే ఆ వీడియోపై బాహుబలి రేంజ్ అంచనాలు పెట్టుకోవద్దని చెప్పారు.
అసలు సినిమా కథ ఏంటి? హీరో పాత్ర ఎలా ఉండబోతుంది? అనే విషయాలను తెలుపుతూ ‘ఫౌజీ’ ప్రపంచాన్ని పరిచయం చేసేలా ఆ స్పెషల్ వీడియో ఉంటుందని రవిశంకర్ అన్నారు. అంటే సినిమా కథా ప్రపంచంపై ఒక స్పష్టమైన అవగాహన కల్పించడమే ఈ గ్లింప్స్ ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. అందుకే ‘బాహుబలి’ స్థాయి భారీ యాక్షన్ కట్‌ను ఆశించవద్దని ఆయన కోరారు.
ఈ గ్లింప్స్‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడంతో పాటు, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ‘418’ మూవీ ప్రదర్శితమయ్యే థియేటర్లలోనూ చూపించనున్నట్లు నిర్మాత వెల్లడించారు. దీంతో ప్రభాస్ పుట్టినరోజున అభిమానులకు బిగ్ స్క్రీన్ పై ‘ఫౌజీ’ ప్రపంచాన్ని చూసే అవకాశం దక్కనుంది.

స్వాతంత్య్రానికి పూర్వం నాటి చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.
మరోవైపు, ‘ఫౌజీ’ విడుదల తేదీపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. 2026 డిసెంబర్ లో విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. 2027 మార్చి 18 కొత్త రిలీజ్ డేట్ అంటున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న వచ్చే గ్లింప్స్‌లో విడుదల తేదీపై కూడా ఏదైనా క్లారిటీ ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: DSPని పక్కన పెట్టేశారా?.. RC17పై నిర్మాత మైత్రి రవి వైరల్ కామెంట్స్.!
[Fauzi Special Video On Prabhas Birthday, Prabhas Fauzi Movie, Prabhas Fauzi Glimpse, Prabhas Fauzi World, Prabhas Birthday, Prabhas, Hanu Raghavapudi, Mythri Ravi Shankar, Telugu Film News]






