Home

»

Latest News

నేరాలు జ‌ర‌గ‌కుండా అడ్డుకోవచ్చా? ఆసక్తిని పెంచే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.!

Oct 14, 2026 2:00PM

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా ఊహించని మలుపులు, నేరాల వెనుక మానసిక పరిస్థితులు, పోలీసుల విచారణతో సాగే కథలను ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తుంటారు. ఈ నేపథ్యంలో మలయాళంలో రూపొందిన ‘ఐస్’ వెబ్ సిరీస్‌ సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహిళలను ప్రేమ పేరుతో వేధించే స్టాకర్లను నేరం జరగకముందే గుర్తించి, వారిని నియంత్రించేందుకు ప్రయత్నించే ఓ ప్రత్యేక బృందం చుట్టూ ఈ కథ సాగుతుంది. ప్రస్తుతం ఈ సిరీస్ సోనీ లివ్‌లో తెలుగు సహా పలు భాషల్లో అందుబాటులో ఉంది.

మహిళలపై వేధింపులు, దాడులు జరిగిన తర్వాత నేరస్థులను పట్టుకోవడం కంటే.. అలాంటి నేరాలు జరగకముందే వాటిని అడ్డుకుంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతో కేరళ పోలీస్ విభాగం ‘ఐస్’ అనే ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తుంది. సాఫ్ట్‌వేర్ నిపుణురాలు విద్య (శ్రుతి రామచంద్రన్), సైకాలజిస్ట్ ఆయేషా (నిఖిలా విమల్), పోలీస్ అధికారులు టీనా సెబాస్టియన్ (కని కుసృతి), జస్టిన్ (ప్రభు మురళీకృష్ణన్), సైకాలజిస్ట్ తన్వీ కలిసి ఈ బృందంలో పనిచేస్తారు.

వేధింపులకు పాల్పడే వ్యక్తుల కదలికలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌, స్మార్ట్‌వాచ్‌ సాయంతో వారిని గమనిస్తుంటారు. బాధితులకు ముప్పు ఎదురయ్యే అవకాశముంటే ముందుగానే గుర్తించి హెచ్చరించాలన్నది ఈ ప్రాజెక్ట్‌ ఉద్దేశం. అయితే ఈ ప్రయోగంలో భాగంగా పర్యవేక్షణలో ఉన్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో బృందానికి అనుకోని సమస్య ఎదురవుతుంది. ఆ తర్వాత ఈ టీమ్‌ తిరిగి ఎలా ఒక్కటైంది? వారు ఎదుర్కొన్న నాలుగు కేసుల వెనుక ఉన్న నిజాలేంటి? అనేది మిగతా కథ.

సాధారణ పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ కథలకు భిన్నంగా, సాంకేతికతను మానసిక విశ్లేషణతో కలిపి చూపించడం ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణ. మహిళలను వేధించే వ్యక్తుల ప్రవర్తనను అర్థం చేసుకోవడం, బాధితులు ఎదుర్కొనే పరిస్థితులను చూపించడం ద్వారా ఓ సామాజిక సమస్యపై చర్చకు తెరలేపారు. ఒక్కో కేసులో ఒక్కో రకమైన నేపథ్యం ఉండటంతో కథలో ఆసక్తి కొనసాగుతుంది. ముఖ్యంగా కొన్ని కేసుల్లో అసలు ఏం జరుగుతోందనే ఉత్కంఠ ప్రేక్షకులను ముందుకు నడిపిస్తుంది.

అయితే ఈ కాన్సెప్ట్‌ ఆచరణలో ఎంతవరకు సాధ్యమనే సందేహం కొన్ని సందర్భాల్లో కలుగుతుంది. స్టాకర్లు సులభంగా పర్యవేక్షణకు అంగీకరించడం, సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా వారి ప్రవర్తనను అంచనా వేయడం వంటి అంశాలు పూర్తిగా నమ్మశక్యంగా అనిపించవు. అంతేకాకుండా ఏడు ఎపిసోడ్లలో ఒక్కోటి సుమారు 50 నిమిషాల నిడివితో ఉండటం వల్ల కొన్ని చోట్ల కథ నెమ్మదిస్తుంది. ముఖ్యంగా మధ్యలో వచ్చే ఎపిసోడ్లు కాస్త సాగదీసినట్లు అనిపిస్తాయి.

పోలీస్‌ అధికారిణి టీనా పాత్రలో కని కుసృతి సహజమైన నటనతో ఆకట్టుకుంటారు. ఆయేషాగా నిఖిలా విమల్‌, విద్యగా శ్రుతి రామచంద్రన్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రభు మురళీకృష్ణన్‌, జాఫర్‌ ఇడుక్కి, దేవ్‌ మోహన్‌, సానియా అయ్యప్పన్‌ తదితరులు కూడా కథకు బలాన్ని చేకూర్చారు. దర్శకుడు మను అశోకన్‌ సీరియస్‌ అంశాన్ని క్రైమ్‌ థ్రిల్లర్‌ రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు.

నేరాలు జరిగిన తర్వాత విచారణ చేయడం కంటే, నేరాలకు దారితీసే ధోరణులను ముందుగానే గుర్తించవచ్చా అనే కొత్త ఆలోచనతో ‘ఐస్’ తెరకెక్కింది. కథలో కొన్ని లోపాలు, నెమ్మదిగా సాగే సన్నివేశాలు ఉన్నప్పటికీ, సామాజిక సమస్యను విభిన్నంగా చూపించే ప్రయత్నం ఆసక్తికరంగా ఉంటుంది. రెగ్యులర్‌ క్రైమ్‌ థ్రిల్లర్లకు భిన్నమైన కథలను ఇష్టపడేవారు ఈ సిరీస్‌ను ఒకసారి చూడొచ్చు.

 

 

[Eyes Web Series Review, Eyes Malayalam Series, Eyes OTT Review, Eyes SonyLIV, Eyes Telugu Review, Manu Ashokan, Kani Kusruti, Nikhila Vimal, Shruti Ramachandran, Malayalam Crime Thriller, SonyLIV Web Series, Eyes Series Cast]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com