ప్రపంచవ్యాప్తంగా హారర్ చిత్రాల ప్రేమికులకు అత్యంత ఇష్టమైన ఫ్రాంచైజీలలో 'ఈవిల్ డెడ్' సిరీస్ ఒకటి. ఈ సిరీస్ నుండి వచ్చే ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ప్రేక్షకులను వణికించేస్తుంటుంది. తాజాగా ఈ క్రేజీ ఫ్రాంచైజీ నుండి రాబోతున్న సరికొత్త హారర్ థ్రిల్లర్ 'ఈవిల్ డెడ్ బర్న్' (Evil Dead Burn). ఈ చిత్రం యొక్క అఫీషియల్ తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలై, సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది.
విడుదలైన కొద్దిసేపటికే ఈ ట్రైలర్ హారర్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మరియు నటీనటుల పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరిలోనూ భయాన్ని, క్యూరియాసిటీని రేకెత్తిస్తున్నాయి. గత చిత్రాల కంటే ఈసారి మరింత క్రూరమైన, భయంకరమైన డెమొనిక్ ఎలిమెంట్స్‌తో దర్శకుడు సెబాస్టియన్ వానిసెక్ ఈ చిత్రాన్ని వెండితెరపై ఆవిష్కరించినట్లు స్పష్టమవుతోంది.
ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. భర్తను కోల్పోయిన ఒక మహిళ, ఒంటరితనం నుండి ఉపశమనం కోసం దూరంగా ఉన్న తన అత్తమామల ఇంటికి వెళుతుంది. అయితే, అక్కడ ఉన్న ఒక రహస్య పుస్తకం (Necronomicon) ద్వారా ఆ కుటుంబంలోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. ఒక్కొక్కరుగా ఆ ఇంట్లోని వారంతా భయంకరమైన డెడ్‌లైట్స్‌గా (Deadites) మారిపోతుంటే, ఆ నరకం నుండి ఆ మహిళ ఎలా ప్రాణాలతో బయటపడింది అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది.
గతంలో వచ్చిన 'ఈవిల్ డెడ్ రైజ్' (2023) చిత్రం అపార్ట్‌మెంట్ నేపథ్యంలో సాగి భారీ విజయాన్ని అందుకోగా, ఈసారి 'ఈవిల్ డెడ్ బర్న్' సరికొత్త లొకేషన్‌లో మరింత వైల్డ్ అండ్ సావేజ్ రైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో లూసియెన్ బుకానన్, హంటర్ డూహన్, సౌహైలా యాకూబ్ ప్రధాన పాత్రల్లో నటించారు. సోనీ పిక్చర్స్ ఇండియా ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
తెలుగు ట్రైలర్ చూసిన సినీ ప్రియులు యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తమ స్పందనలను పంచుకుంటున్నారు. "ట్రైలర్ లోని కొన్ని సీన్లు చూస్తుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది", "ఈసారి థియేటర్లలో భయపడటానికి రెడీ అవ్వాల్సిందే" అంటూ హారర్ లవర్స్ కామెంట్లు పెడుతున్నారు. హాలీవుడ్ స్థాయి మేకింగ్ వాల్యూస్ ఈ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతున్న ఈ మోస్ట్ అవేటెడ్ హాలీవుడ్ హారర్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా జూలై 10న ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ సరికొత్త చాప్టర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.




