Home

»

Latest News

టైటిల్స్‌పై సెన్సార్ ఫోకస్: విడుదలకు ముందు సినిమాలకు మళ్ళీ బారసాల.!

Nov 4, 2026 3:19PM

సినిమా అనౌన్స్‌మెంట్ సమయంలో పెట్టిన టైటిల్ ఒకటి.. థియేటర్లలోకి వచ్చేసరికి కనిపించే టైటిల్ మరొకటి. టాలీవుడ్‌లో ఈ మధ్య ఇలాంటి మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సెన్సార్ బోర్డు అభ్యంతరాలు టైటిల్ మార్పులకు ప్రధాన కారణంగా మారుతున్నాయి.

సినిమా టైటిల్ అనేది ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే దర్శక నిర్మాతలు తమ కథకు తగ్గట్టుగా క్యాచీ పేర్లను ఎంచుకుంటారు. పోస్టర్లు, టీజర్లతో ఆ టైటిల్‌ను జనాల్లోకి తీసుకెళ్తారు. అయితే తీరా సినిమా సెన్సార్‌కు వెళ్లే సమయానికి అసలు సమస్య మొదలవుతోంది. టైటిల్ ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, దేవుళ్ల పేర్లతో వివాదాలు వచ్చే అవకాశం ఉందని, టైటిల్ ఇబ్బందికరంగా ఉందని సెన్సార్ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారట.

ఆ మధ్య సుహాస్ నటించిన సినిమాకు మొదట 'హే భగవాన్' అనే టైటిల్ అనుకున్నారు. అయితే సెన్సార్ అభ్యంతరాలతో చివరి నిమిషంలో 'హే బలవంత్'గా మార్చాల్సి వచ్చింది. అలాగే అవినాష్, నందు, సిమ్రాన్ చౌదరి నటించిన 'వానర' సినిమా పేరు 'వనవీర'గా మారింది. రాజీవ్ కనకాల, శివ కందుకూరి నటించిన 'చాయ్ వాలా' సినిమా కూడా 'నవాబ్ కేఫ్'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఇక తాజాగా యూట్యూబ్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని, 'లిటిల్ హార్ట్స్'తో మంచి విజయాన్ని అందుకున్న మౌళి కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నారు. ఆయన నటిస్తున్న కొత్త సినిమాకు మొదట 'దొంగ నా కొడుకు' అనే టైటిల్ పెట్టారు. కానీ సెన్సార్ అభ్యంతరాలతో ఇప్పుడు ఆ పేరును 'DNK'గా మార్చేశారు. శ్రీను కంబాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. నవంబర్ 13న విడుదలకు సిద్ధమవుతోంది.

సినిమా టైటిల్‌ను రిజిస్టర్ చేయించుకున్నంత మాత్రాన అది చివరి వరకు అలాగే ఉంటుందని గ్యారెంటీ లేదు. సెన్సార్ దగ్గర అభ్యంతరాలు వస్తే మళ్లీ మొదటి నుంచి ప్రమోషన్లు మార్చుకోవాల్సి వస్తోంది. అప్పటికే పాత టైటిల్‌తో విడుదల చేసిన పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లు నిరుపయోగంగా మారుతున్నాయి. బుక్ మై షో వంటి టికెట్ బుకింగ్ యాప్స్‌లో పాత పేరుతో సినిమా వెతికే ప్రేక్షకులకు కూడా కన్ఫ్యూజన్ తప్పడం లేదు.

ముఖ్యంగా చిన్న సినిమాల నిర్మాతలకు ఇది అదనపు ఆర్థిక భారంగా మారుతోంది. ఒక టైటిల్‌తో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత మరో పేరుతో సినిమా ప్రమోట్ చేయడం అంత సులభం కాదు. అందుకే ముందే ఒకటికి రెండు సార్లు ఆలోచించి టైటిల్ పెట్టుకోవడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: ‘రామాయణ’పై అల్లు అర్జున్ ట్వీట్.. ఇది సినిమా మాత్రమే కాదు.!

 

 

 

[Tollywood Title Changes, Donga Naa Koduku Title Changed, Censor Board, DNK Movie, Donga Naa Koduku, Tollywood Movie Titles, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com