సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే కేవలం భారీ విజువల్స్, వందల కోట్ల బడ్జెట్, స్టార్ కాస్టింగ్ మాత్రమే ఉంటే సరిపోదని మరోసారి రుజువైంది. బలమైన కథ, గుండెలను తాకే భావోద్వేగాలు ఉంటే చిన్న చిత్రాలు కూడా ప్రపంచ స్థాయి బాక్సాఫీస్‌ను షేక్ చేయగలవని అనేక సినిమాలు నిరూపించాయి. మన దగ్గర వచ్చిన 'హనుమాన్' వంటి చిత్రాలు అల్ప బడ్జెట్‌తో వచ్చి ఊహించని వసూళ్లు సాధించినట్లే, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఒక చైనీస్ ఫ్యామిలీ డ్రామా భారీ సంచలనం సృష్టిస్తోంది.
అదే 'డియర్ యూ' (Dear You). హాంగ్‌చున్ లాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం చైనీస్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర తిరగరాస్తోంది. 2026 ఏప్రిల్ 30న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సుమారు 14 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో (మన భారతీయ కరెన్సీలో రూ. 132 కోట్లు) రూపుదిద్దుకుంది. అయితే ఈ చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీస్ వద్ద రాబట్టిన వసూళ్లు చూసి గ్లోబల్ ట్రేడ్ వర్గాలు సైతం నోరెళ్లబెడుతున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా చైనాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా 300 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. అంటే ఇండియన్ రూపాయిల్లో ఈ వసూళ్లు దాదాపు రూ. 2,849 కోట్లకు పైగానే ఉండటం విశేషం! పెట్టిన పెట్టుబడికి ఏకంగా ఇరవై రెట్లకు పైగా లాభాలను తీసుకొచ్చి 2026లో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద సంచలనాల్లో ఒకటిగా నిలిచింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. చైనీస్ భాషలో 'డియర్ యూ' అంటే 'అమ్మమ్మకు ప్రేమలేఖ' అనే ఆత్మీయ భావం వస్తుంది. అప్పులు, కుటుంబ సమస్యల్లో కూరుకుపోయిన ఒక యువకుడు, థాయ్‌లాండ్‌లో కోటీశ్వరుడిగా స్థిరపడ్డాడని భావిస్తున్న తన తాతను వెతికేందుకు బయలుదేరడంతో ఈ కథ ప్రారంభమవుతుంది. తీరా అక్కడికి వెళ్లాక దశాబ్దాల క్రితం నాటి ఒక హృదయవిదారక రహస్యం బయటపడుతుంది. వలసల నేపథ్యం, మానవ అనుబంధాలు, ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే ఈ డ్రామా ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తోంది.
ఈ సినిమాకు వస్తున్న ఊహించని రెస్పాన్స్ చూసి మేకర్స్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 4న ఉత్తర అమెరికా (USA) థియేటర్లలో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
ప్రస్తుతం గ్లోబల్ ఫిలిం వర్గాల్లో 'డియర్ యూ' మూవీ వసూళ్లపైనే చర్చ నడుస్తోంది. ఎలాంటి అర్భాటాలు లేకుండా కేవలం భావోద్వేగాల బలంతో ఏకంగా రూ. 2800 కోట్లకు పైగా కొల్లగొట్టిన ఈ చిత్రం, రాబోయే రోజుల్లో గ్లోబల్ వైడ్‌గా ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాలి!





