తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా దక్షిణాది సినీ లోకంలో విలక్షణ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న హీరో చియాన్ విక్రమ్. పాత్ర కోసం ప్రాణం పెట్టే నటుల్లో ఆయన ముందు వరుసలో ఉంటారు. సినిమా ఏదైనా, రోల్ ఎలాంటిదైనా సరే.. ఆ క్యారెక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేయడానికి విక్రమ్ పడే కష్టం అంతా ఇంతా కాదు. తాజాగా ఈ వెర్సటైల్ యాక్టర్ తన లుక్‌తో మరోసారి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. 60 ఏళ్ల వయసులో కూడా పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ అందరి కళ్లు తన వైపు తిప్పుకున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో విక్రమ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవల ఒక రెస్టారెంట్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న సమయంలో తీసిన విక్రమ్ ఫోటోలను చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. అందులో ఆయన చాలా యంగ్‌గా, ఒత్తైన జుట్టుతో, గ్లామరస్‌గా కనిపిస్తున్నారు. షష్టిపూర్తి వయసు సమీపిస్తున్నా విక్రమ్ ఇంత ఫ్రెష్‌గా ఎలా ఉన్నారనే చర్చ ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది. ఈ లుక్ చూస్తుంటే ఆయన ఏదైనా మేకోవర్ కోసం సర్జరీ చేయించుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నెట్టింట ప్రచారం జరుగుతున్న దాని ప్రకారం.. విక్రమ్ తన కొత్త సినిమా కోసం విదేశాల్లో అత్యాధునిక కాస్మెటిక్ ట్రీట్‌మెంట్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యాంటీ ఏజింగ్ థెరపీ లేదా ఫేస్ సర్జరీ ద్వారా ఆయన తన వయసును దాచేసి, మళ్ళీ కుర్రాడిలా మారిపోయారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే, విక్రమ్ సన్నిహితులు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. ఆయన తన డైట్, కఠినమైన వ్యాయామం మరియు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి వల్లే ఇలా ఫిట్‌గా ఉన్నారని, ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని చెబుతున్నారు.
నిజానికి విక్రమ్ తన కెరీర్ ఆరంభం నుండి ఫిజిక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. గతంలో 'ఐ' సినిమా కోసం ఆయన తన శరీరాన్ని ఎంతగా మార్చుకున్నారో అందరికీ తెలిసిందే. అలాగే ఇటీవల వచ్చిన 'తంగలాన్' సినిమా కోసం కూడా విక్రమ్ తన ఆహార్యాన్ని పూర్తిగా మార్చేసుకున్నారు. ఆ సినిమాలో ఒక గిరిజన నాయకుడిగా కఠినమైన పాత్రలో కనిపించి మెప్పించారు. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే, తదుపరి చిత్రం కోసం విక్రమ్ ఇలా సడన్ గా యంగ్ లుక్ లోకి మారిపోవడం అందరినీ థ్రిల్ చేస్తోంది.





