
టాలీవుడ్ మోస్ట్ అవైటింగ్ మల్టీస్టారర్
చిరంజీవి-బాలకృష్ణ కాంబినేషన్ సినిమా ఎప్పుడు?
త్వరలో అభిమానుల కోరిక నెరవేరుతుందా?
కోలీవుడ్ సీనియర్ స్టార్స్ కమల్ హాసన్(Kamal Haasan), రజినీకాంత్(Rajinikanth) కలయికలో భారీ మల్టీస్టారర్ రానున్న సంగతి తెలిసిందే. 'జైలర్' ఫేమ్ నెల్సన్ దర్శకత్వంలో రెడ్ జెయింట్ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో సోషల్ మీడియాలో టాలీవుడ్ సీనియర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్ మల్టీస్టారర్ గురించి తెగ చర్చ జరుగుతోంది. (KHxRK reunion)
తెలుగునాట చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna) ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇద్దరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తలపెడితే పండగ వాతావరణం నెలకొంటుంది. ఇక ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటిస్తే.. హైప్ ఏ రేంజ్ కి వెళ్తుందో ఊహలకు కూడా అందదు.
చిరంజీవి, బాలకృష్ణ కాంబో మల్టీస్టారర్ కోసం తెలుగు సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవం వేడుకలో పాల్గొన్న చిరంజీవి సైతం.. బాలకృష్ణతో కలిసి నటించాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టారు. అప్పటి నుంచి చిరు-బాలయ్య మల్టీస్టారర్ గురించి చర్చ మొదలైంది.
ఇక ఇప్పుడు కమల్ హాసన్, రజినీకాంత్ మల్టీస్టారర్ ప్రకటన నేపథ్యంలో.. చిరు-బాలయ్య మల్టీస్టారర్ చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా అభిమానులు కోరుతున్నారు. అనిల్ రావిపూడి, బాబీ కొల్లి వంటి దర్శకులు ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. మరి త్వరలోనే అభిమానుల కోరిక నెరవేరుతుందేమో చూడాలి.








