పాకిస్థాన్ వెబ్‌సిరీస్ బ్యాన్.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక సూచన.!
Nov 26, 2026 2:18PM

ఓ పాకిస్థాన్ వెబ్‌సిరీస్ ఇప్పుడు భారత్‌లో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ నటించిన ‘జో బచాయే హై సంగ్ సమేత్ లో’ (Jo Bachay Hain Sang Samait Lo) సిరీస్ డిసెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సిరీస్ ను భారత్‌లో స్ట్రీమింగ్ కాకుండా నిలిపివేయాలని పెద్దఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నెట్‌ఫ్లిక్స్‌కు కీలక సూచన చేసింది. పాకిస్థాన్‌లో రూపొందిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, పాటలు, ఇతర కంటెంట్‌ను భారత్‌లో అందుబాటులో ఉంచకూడదని 2025 మే 8న ఇచ్చిన అడ్వైజరీని మరోసారి గుర్తుచేసింది. ఆ సూచనలను తప్పనిసరిగా పాటించాలని నెట్‌ఫ్లిక్స్‌కు స్పష్టం చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్‌లో పాకిస్థాన్‌కు చెందిన కంటెంట్‌పై కేంద్రం ఈ అడ్వైజరీ ఇచ్చింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు డిజిటల్ స్ట్రీమింగ్ సేవలు కూడా ఈ సూచనలను పాటించాలని అప్పట్లో స్పష్టం చేసింది.

నిజానికి గత ఏడాది జూన్‌లోనే.. పాకిస్థాన్‌లో రూపొందిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లను భారతీయ సబ్‌స్క్రైబర్లకు అందుబాటులో ఉంచడం లేదని నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసింది. ఇప్పుడు కూడా అదే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కేంద్రం గుర్తుచేసింది.
ఇది కూడా చదవండి: రామాయణ టీమ్‌తో అమిత్ షా ప్రత్యేక భేటీ.!
ఇంతకీ ఈ వివాదానికి కారణమైన సిరీస్ విషయానికి వస్తే.. ‘జో బచాయే హై సంగ్ సమేత్ లో’ ఒక రొమాంటిక్ డ్రామా. ప్రముఖ రచయిత్రి ఫర్హత్ ఇష్తియాక్ రాసిన ఉర్దూ నవల ఆధారంగా దీన్ని రూపొందించారు. ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్‌తో పాటు సనమ్ సయీద్, అహద్ రజా మీర్, హనియా అమీర్ తదితరులు ఇందులో నటించారు. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేసింది.

అయితే ఈ సిరీస్‌ను భారత్‌లో విడుదల చేయకూడదని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) కూడా ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరింది. సోషల్ మీడియాలోనూ ఈ సిరీస్ ను బ్యాన్ చేయాలనే డిమాండ్స్ వచ్చాయి. ఇప్పుడు కేంద్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడంతో ఆ సిరీస్ కు ఇండియాలో బ్రేకులు పడ్డాయి.
మీకు నచ్చవచ్చు:
తెల్లవారుజామున భజన.. అక్షయ్ కుమార్ పరువు తీసేసిన ట్వింకిల్ ఖన్నా.!
బాహుబలి కాంబో రిపీట్.. వారణాసి తర్వాత ప్రభాస్‌తో రాజమౌళి సినిమా.!
[India, Netflix, Pakistani Web Series, Jo Bachay Hain Sang Samait Lo, OTT News]




