Home

»

Latest News

అనిరుధ్, కావ్యల పెళ్లి న‌వంబ‌ర్‌లో.. క‌న్‌ఫ‌ర్మ్ చేసిన సీనియ‌ర్ న‌టుడు!

Jun 28, 2026 10:50AM

సంగీత ప్రపంచంలో తనదైన బాణీలతో కుర్రకారును ఊపేస్తున్న రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఐపీఎల్ క్రికెట్ గ్రౌండ్‌లో తన హావభావాలతో 'నేషనల్ క్రష్'గా మారిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అధినేత కావ్యా మారన్ త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారంటూ గత కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రేజీ జంట రిలేషన్‌షిప్‌పై రకరకాల పుకార్లు వస్తున్న తరుణంలో, గతంలో అనిరుధ్ వాటిని ఖండించినప్పటికీ చెన్నై మీడియాలో మాత్రం ఈ వార్తలు ఆగలేదు. అయితే, ఈ ఊహాగానాలకు తెరదించుతూ, అనిరుధ్ కుటుంబ సభ్యుడే స్వయంగా ఈ పెళ్లి వార్తను ధృవీకరించడంతో ఇప్పుడు అటు సినీ పరిశ్రమలోనూ, ఇటు క్రికెట్ సర్కిల్స్‌లోనూ ఇది హాట్ టాపిక్‌గా మారింది.

అనిరుధ్‌కు వరుసకు పెద్దనాన్న అయ్యే ప్రముఖ సీనియర్ తమిళ నటుడు, నాటక రచయిత వైజీ మహేంద్రన్ ఒక ఇంటర్వ్యూలో ఈ పెళ్లి వార్తలపై స్పందిస్తూ సంచలన విషయాలు వెల్లడించారు. అనిరుధ్ ఎంతో మృదుస్వభావి అని, అతను చాలా పెద్ద ఇంటి సంబంధం చేసుకోబోతున్నాడని చెబుతూ అతనికి ముందస్తు అభినందనలు తెలియజేశారు. తాను విన్న సమాచారం ప్రకారం వీరిద్దరి వివాహం ఖచ్చితంగా జరగబోతోందని, ఇరు కుటుంబాల పెద్దలు కూడా ఈ పెళ్లికి పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపారని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు సినిమా ఇండస్ట్రీ, మరోవైపు బిజినెస్ నెట్‌వర్క్ కలిస్తే వచ్చే ఆ బజ్ వేరే లెవెల్‌లో ఉంటుందని అభిమానులు అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు.

ఈ సందర్భంగా కావ్య మారన్ వ్యక్తిత్వాన్ని, ఆమె వ్యాపార దక్షతను వైజీ మహేంద్రన్ ప్రత్యేకంగా కొనియాడారు. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్యా మారన్ కేవలం ఒక సాధారణ అమ్మాయి కాదని, బిజినెస్ జీన్స్‌ను పూర్తిగా పుణికిపుచ్చుకుందని ప్రశంసించారు. అందుకే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి పెద్ద ఫ్రాంచైజీతో పాటు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, ది హండ్రెడ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ వంటి భారీ జట్లను ఆమె విజయవంతంగా నడిపిస్తోందని గుర్తుచేశారు. గతంలో తాము ఒక ప్రాజెక్ట్ కోసం వెళ్లినప్పుడు సన్ టీవీ ఓటీటీ విభాగానికి హెడ్‌గా ఉన్న కావ్య తమను ఎంతో మర్యాదగా చూసుకుందని, కథలు నచ్చి ఒకేసారి 6 ప్రాజెక్టులను ఎంపిక చేసిందని ఆమెతో ఉన్న పాత అనుభవాలను పంచుకున్నారు.

టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా సౌత్ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ నంబర్ వన్ రేంజ్‌లో దూసుకుపోతున్న అనిరుధ్, పదునైన వ్యాపార వ్యూహాలతో బిజినెస్ సామ్రాజ్యాన్ని ఏలుతున్న కావ్య మారన్ పెళ్లి తర్వాత జంటగా మరింత రాణిస్తారని మహేంద్రన్ ఆశాభావం వ్యక్తం చేశారు. పెళ్లయ్యాక వీరిద్దరూ కలిసి ఒక పెద్ద 'మ్యూజికల్ బిజినెస్' చేస్తారంటూ ఆయన నవ్వుతూ చమత్కరించారు. రజనీకాంత్, కమల్ హాసన్, షారుఖ్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్ వంటి దిగ్గజ హీరోల చిత్రాలకు బ్లాక్‌బస్టర్ ఆల్బమ్స్ అందించిన అనిరుధ్, కోట్లాది రూపాయల సన్ నెట్‌వర్క్ వారసురాలైన కావ్యను నవంబర్ నెలలో వివాహం చేసుకోబోతున్నారని, దానికి సంబంధించిన అధికారిక నిశ్చితార్థ ప్రకటన అతి త్వరలోనే రానుందని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో సంబరాలు చేసుకుంటున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com