
ఫుడ్ డెలివరీ బాయ్ పై 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో అఖిల్ రాజ్ (Akhil Raj) దాడి చేశాడంటూ నిన్నటి నుండి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. రాంగ్ డెలివరీ చేసినందుకు, డెలివరీ బాయ్ సారీ చెబుతున్నా వినకుండా.. దాడి చేసినట్టుగా ఆ వీడియోలో ఉంది. అంతేకాదు, హీరో తల్లి తన ముఖంపై ఉమ్మి వేసిందంటూ డెలివరీ బాయ్ సంచలన ఆరోపణ కూడా చేశాడు. దీంతో ఆ వీడియో చూసిన నెటిజెన్లు.. హీరో అఖిల్ రాజ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్క సినిమా హిట్ అయితేనే ఇంత అహంకారామా? అంటూ ఫైర్ అయ్యారు. అయితే ఈ వివాదంపై తాజాగా అఖిల్ రాజ్ స్పందించాడు. అసలు అక్కడ జరిగింది వేరని, తప్పంతా ఆ డెలివరీ బాయ్ దేనని అన్నాడు.
"మద్యం మత్తులో ఉన్న డెలివరీ బాయ్.. ఆపోజిట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ లో ఇవ్వాల్సిన డెలివరీ, మాకు ఇచ్చాడు. మా ఇంట్లో ఎవరో ఆర్డర్ చేశారనుకొని, దానిని మా నాన్న తీసుకున్నారు. ఆ తర్వాత అది మాది కాదని తెలిసి, మా అమ్మ ఆ ప్యాకెట్ ను పక్కన పెట్టింది. కాసేపటికి డెలివరీ బాయ్ వస్తే.. తన ప్యాకెట్ తనకి ఇచ్చేశాము. కానీ, అతను నోరు పారేసుకున్నాడు. ఫ్రీగా వస్తే తీసుకుందాం అనుకున్నావా అంటూ మా అమ్మపై మాటలు తూలాడు. దాంతో నాకు కోపమొచ్చి సీరియస్ అయ్యాను. దానికి అతను నువ్వు హీరో కదా నీ వీడియో తీసి పరువు తీస్తా అంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. తానే మద్యం మత్తులో రాంగ్ డెలివరీ ఇచ్చి, పైగా మా అమ్మను అనడంతో నాకు కోపమొచ్చి ఒక కొడుకుగా రియాక్ట్ అయ్యాను. అంతేతప్ప డెలివరీ బాయ్ అంటే చిన్న చూపు లేదు. నేనూ ఆ స్థాయి నుంచే వచ్చినవాడిని. ఈ విషయంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాను. నేను అంతగా రియాక్ట్ అవ్వకుండా, సైలెంట్ గా వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది. కానీ, మా అమ్మను అనేసరికి ఆ టైంలో అలా రియాక్ట్ అయ్యాను." అంటూ ఈ వివాదంపై క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశాడు అఖిల్ రాజ్.





