Home

»

Latest News

కోట్ల మందికి ఇన్ స్ప్రెషన్:  ఈమె కథతో సినిమా వస్తుందా! 

Sep 1, 2026 12:18PM

 


సినిమా.. ఒకేసారి కొన్ని కోట్ల మందికి ఇన్ స్ప్రెషన్ కలిగించడంతో పాటు మంచి మార్గంలో పయనించేలా చేసే ఏకైక సాధనం. కాకపోతే  ఆకాశంలో నక్షత్రాలని లెక్కపెట్టడం ఎలా అయితే అసాధ్యమో, సినిమా వల్ల మంచి జరిగిన వాళ్ళని లెక్కపెట్టడం కూడా అసాధ్యం. అందుకే ఇన్ స్ప్రెషన్ కలిగించే సినిమాలు అడపాదడపా రావాలని సినీ ప్రేమికులు, ప్రేక్షకులు కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే రీసెంట్ గా 47 ఏళ్ల 'రమాబాయి' అనే మహిళ  చూపిన పోరాటపటిమ. 


రమాబాయి రణ్‌వీర్ ది మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంబాజోగై ప్రాంతం. భర్త ప్రమాదంలో చనిపోయిన తర్వాత కుటుంబ భారమంతా రమాబాయి భుజాలపైపడింది. రోజువారీ వంట మనిషిగా పనిచేస్తూ, రెక్కల కష్టం మీద ఇద్దరు కుమార్తెలను పోషిస్తోంది. పెద్ద కుమార్తె పూజ పోలీస్ ఉద్యోగానికి, చిన్న కుమార్తె బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఏనాడూ తన పేదరికాన్ని పిల్లల చదువుకు అడ్డంకిగా మారనివ్వలేదు ఈ ధీర వనిత.

అంబాజోగైలో భారతీయ शिक्षण ప్రసారక్ సంస్థ కోలేశ్వర్ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ అమృత మహోత్సవ వేడుకల సందర్భంగా 'అమృత్ దౌడ్' పేరిట భారీ మారథాన్ పరుగు పందెం నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ నుండి భాగ్యనగర్ చౌక్ వరకు సాగిన ఈ మారథాన్‌లో గెలిచిన విజేతకు రూ. 3,000 నగదు బహుమతి ప్రకటించారు. ఆ మూడు వేల రూపాయల బహుమతి మొత్తం రమాబాయి కంటపడింది. ఆ డబ్బులు ఉంటే తన కుమార్తెలకు పుస్తకాలు, పరీక్షల ఫీజులు చెల్లించవచ్చని ఆమె భావించింది. వంటగది పనికే పరిమితమైన ఆమె, ఎలాంటి ముందస్తు శిక్షణ లేదా అనుభవం లేకుండానే మారథాన్‌లో పాల్గొనాలని నిర్ణయించుకుంది.

పోటీ రోజున గ్రౌండ్‌లో దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకవైపు ట్రాక్‌సూట్లు, బ్రాండెడ్ రన్నింగ్ స్పోర్ట్స్ షూస్ ధరించి రన్‌కు సిద్ధమైన ఎందరో యువతీ యువకులు. మరొకవైపు సాధారణ నేత చీర, కాళ్లకు మామూలు చెప్పులతో నిలబడిన 47 ఏళ్ల రమాబాయి. ఈమె మారథాన్‌లో పరిగెత్తగలదా అని చూసేవారు పెదవి విరిచారు. కానీ విజిల్ మోగగానే రమాబాయి పరుగు లంకించుకుంది. పరుగు ప్రారంభమైన కొద్దిసేపటికే ఆమె వేసుకున్న చెప్పులు జారిపోతూ వేగానికి అడ్డంకిగా మారాయి. ఏమాత్రం ఆలోచించకుండా ఆ చెప్పులను ఊడదీసి చేతుల్లో పట్టుకుంది. పదునైన రాళ్లు, గరుకు రోడ్డును కూడా లెక్కచేయకుండా బరిగాలితోనే పరుగెత్తడం ప్రారంభించింది. ఒక చేతిలో చెప్పులు, మరో చేతితో కొంగును సర్దుకుంటూ రమాబాయి కనబరిచిన వేగం సమస్త ప్రేక్షకులను స్తంభింపజేసింది. ప్రతి అడుగులోనూ ఆమెకు తన పిల్లల భవిష్యత్తు, వారి చదువుల ఆశయాలే కనిపించాయి. ట్రాక్‌సూట్లు, స్పోర్ట్స్ షూస్ ధరించిన కుర్రకారును ఒక్కొక్కరిగా వెనక్కి నెడుతూ ఆమె ముందంజ వేసింది. ఆఖరికి అందరికంటే ముందుగా ఫినిషింగ్ లైన్‌ను దాటి మొదటి స్థానంలో నిలిచి  3,000 నగదు బహుమతిని దక్కించుకుంది. విశేషమేమిటంటే, ఆమె కుమార్తె పూజ కూడా ఈ పోటీలో పాల్గొని రెండో స్థానంలో నిలవడం విశేషం.

Also Read: బడ్జెట్ 2 కోట్లు: కలెక్షన్ల తుఫాన్.. వందల కోట్లతో తెరకెక్కినా దీని ముందు దిగదుడుపే  

పోటీ నిర్వాహకులు బహుమతి అందజేస్తున్నప్పుడు రమాబాయి కళ్లలో ఆనందభాష్పాలు ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పించాయి. బహుమతి సొమ్ము 3,000 ను పూర్తిగా తన కుమార్తెల పుస్తకాలు, ఫీజుల కోసమే ఉపయోగిస్తానని గర్వంగా చెప్పింది. ఒక సాదాసీదా తల్లి చూపిన ఈ అసాధారణ పట్టుదల, కన్నబిడ్డల పట్ల ఉన్న అపరిమితమైన ప్రేమ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రపంచంలో అమ్మకంటే గొప్ప యోధులు ఎవరూ లేరని నెటిజన్లు నీరాజనాలు పడుతున్నారు. తల్లే తొలి పాఠశాల, తల్లే గెలుపుకు నిజమైన ప్రేరణ అని రమాబాయి తన అద్భుత విజయంతో మరోసారి నిరూపించింది! దీంతో రమాబాయి జీవిత కథని సినిమాగా తెరకెక్కిస్తే డబ్బు విలువ తెలియడంతో పాటు ఆడవాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తుందనే మాటలు ప్రజల నుంచి వినపడుతున్నాయి. మరి సినిమాగా వస్తుందేమో చూడాలి.  ఎందుకంటే ఆమె పోరాటం  మూడువేలు కోసమే కావచ్చు. కానీ ఆ పోరాటం ఎంతో మంది గుండెల్లో కసి, పట్టుదల, స్ఫూర్తి నింపే ఆయుధ కర్మాగారం.

 

 

[47 Year Old Mother,  Marathan, Ramabai Ranveer, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com