
ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కానీ కొన్నేళ్లకే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని.. అభిమానుల గుండెల్లో ‘పవర్ స్టార్’గా స్థానం సంపాదించుకున్నారు. ఆయనే పవన్ కళ్యాణ్.
తెరపై తనదైన స్టైల్, మేనరిజమ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన సినీ ప్రయాణం మూడు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. 1996 అక్టోబర్ 11న విడుదలైన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో మొదలైన ఈ ప్రయాణం.. ఎన్నో విజయాలు, ప్రయోగాలు, మలుపులతో సాగింది.
పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ బాబు. 1996లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో, అల్లు అరవింద్ నిర్మించిన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలతో ప్రేక్షకులకు చేరువయ్యారు.
అయితే తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాలు ఆయనకు యువతలో ప్రత్యేకమైన క్రేజ్‌ను తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్ అప్పట్లో కొత్త ట్రెండ్‌ను సృష్టించాయి.

కేవలం నటనకే పరిమితం కాకుండా జానీ సినిమాతో కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా, పవన్ కళ్యాణ్‌కు ఉన్న ప్రత్యేకమైన అభిమానగణం మాత్రం ఎప్పుడూ చర్చనీయాంశంగానే నిలిచింది.
సినిమాల్లో తనదైన ముద్ర వేసిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఊటీలో 12 రోజులు.. ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు ఏం చేస్తున్నారంటే.?
[30 Years of Pawan Kalyan, Pawan Kalyan 30 Years in Cinema, Power Star Pawan Kalyan, Akkada Ammayi Ikkada Abbayi, Pawan Kalyan First Movie, Pawan Kalyan, Telugu Film News]





