Updated : Aug 5, 2024
ఒక సినిమాకి కథ ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెపక్కర్లేదు. అందుకే కథల కోసం కొన్ని నెలలపాటు కుస్తీ పడుతుంటారు. తమకు నచ్చే కథ కోసం నిత్యం అన్వేషిస్తూనే ఉంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో ఒక భాషలో సూపర్‌హిట్ అయిన సినిమాను తమ భాషలో రీమేక్ చేసేందుకు ఇష్టపడతారు దర్శకనిర్మాతలు. అయితే విదేశీ చిత్రాలను చూసి వాటిని ఫ్రీమేక్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది వేరే విషయం. ఇలాంటి విదేశీ చిత్రాల ఫ్రీమేక్‌ల వల్ల ఒక్కోసారి ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే కథతో సినిమాలు చేసేస్తూ ఉంటారు. అలాంటి ఓ విచిత్రమైన పరిస్థితి టాలీవుడ్‌లో రెండు సినిమాలకు వచ్చింది. అయితే అందులో ఒకటి రీమేక్ కాగా, మరొకటి ఫ్రీమేక్. పైగా రెండు సినిమాలూ ఒకే రోజున రిలీజ్ అయ్యాయి. అప్పుడు ఏం జరిగిందనేది తెలుసుకుందాం.
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘ఆర్యన్’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించారు. రమ్యకృష్ణ, శోభన, శరత్ సక్సేనా ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయి శతదినోత్సవం జరుపుకుంది. 1988లో విడుదలైన ఈ సినిమా ఆ సంవత్సరానికి హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని హిందీలో ఆర్యన్ మేరా నామ్ పేరుతో డబ్ చేశారు. తమిళ్‌లో సత్యరాజ్ హీరోగా ద్రవిడన్ పేరుతో రీమేక్ చేశారు. కన్నడలో చక్రవర్తిగా, తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా ఎస్.ఎస్.రవిచంద్ర దర్శకత్వంలో ‘అశోక చక్రవర్తి’ పేరుతో రీమేక్ చేశారు. ఈ మూడు రీమేక్‌లలో కూడా శరత్ సక్సేనా ఒకే పాత్రలో నటించడం విశేషం.
అసలు విషయానికి వస్తే.. ఆర్యన్ రీమేక్ రైట్స్‌ను అశోకచక్రవర్తి నిర్మాతలు రూ.3లక్షలకు కొనుగోలు చేసి చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ రచన చేశారు. అదే సమయంలో వెంకటేష్ హీరోగా వై.నాగేశ్వరరావు దర్శకత్వంలో ధ్రువనక్షత్రం పేరుతో మరో సినిమాను ప్రారంభించారు. ఆ సినిమాకి పరుచూరి బ్రదర్స్ కథ, మాటలు అందించారు. అయితే స్క్రీన్‌ప్లే, క్లైమాక్స్, మరికొన్ని సన్నివేశాలను మార్చి అదే కథతో సినిమాను నిర్మించారు. ఈ రెండు సినిమాలు ఒకే రోజు అంటే 1989 జూన్ 29న విడుదలయ్యాయి. ధ్రువనక్షత్రం సూపర్‌హిట్ అవ్వగా, అశోకచక్రవర్తి ఫ్లాప్ అయ్యింది. ధ్రువనక్షత్రం తమ సినిమా కథతోనే రూపొందించారని తెలుసుకున్న అశోకచక్రవర్తి నిర్మాతలు ఆంధ్రజ్యోతి పేపర్‌లో ఓ ప్రకటన ఇచ్చారు. ‘అశోక చక్రవర్తి’ కథ ఇటీవల విడుదలైన మరో సినిమా కథ ఒక్కటే. అది యదార్థమా.. అయితే దానికి కారకులెవరు.. మూడు లక్షలు చెల్లించి రీమేక్ రైట్స్ తీసుకొని చిత్రాన్ని నిర్మించిన మాదా? కథాచౌర్యం చేసి చిత్రాన్ని నిర్మించిన వారిదా? మా చిత్రానికి మాటలు రాసి, అదే కథను స్వల్ప మార్పులు చేసి కథ, మాటలు అందించిన ఆత్మీయ రచయితల అమోఘ మేధా శక్తిదా? ఎవరిది?.. మీరే నిర్ణయించండి’ ఇదీ ఆ ప్రకటనలోని సారాంశం.
ఈ విషయం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కావడం, కొన్ని మార్పులతో రెండు సినిమాల కథలు ఒకటే కావడంతో ధ్రువనక్షత్రం యూనిట్ విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. న్యాయంగా ఒరిజినల్ నిర్మాతల నుంచి రైట్స్ కొనుక్కొని తీసిన సినిమా ఫ్లాప్ అయింది. అన్యాయంగా కథాచౌర్యం చేసి నిర్మించిన సినిమా సూపర్‌హిట్ అయింది. ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ ‘రెండు సినిమాల కథలూ ఒకటేనన్న విషయం తనకి తెలియదని, తెలిసి వుంటే ఈ సినిమా చేసేవాడినే కాదని అన్నారు. బాలకృష్ణ మాత్రం ఈ విషయం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దాంతో ఈ వివాదం సద్దుమణిగింది.