Home

»

Featured News

ఒకే ఏడాది 5 బ్లాక్‌బస్టర్స్: శోభన్‌బాబుకి 'సోగ్గాడు' పేరు ఎలా వచ్చిందో తెలుసా.?

Sep 29, 2026 6:21PM

ఒక స్టార్‌ నుంచి ఏడాదికి రెండు మూడు సినిమాలు వస్తేనే పెద్ద విషయంగా. అలాంటిది ఒకే ఏడాది ఏకంగా 8 సినిమాలు విడుదల చేసి.. అందులో 5 సినిమాలను ఘన విజయాలుగా నిలబెట్టడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన రికార్డు శోభన్‌బాబు కెరీర్‌లో ఉంది. ఆయన కెరీర్‌లో 1975 సంవత్సరం ఈ కారణంగానే ప్రత్యేకంగా నిలిచిపోయింది.

1959లో ‘దైవబలం’తో సినిమాల్లోకి వచ్చిన శోభన్‌బాబు.. క్రమంగా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యామిలీ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. అయితే 1975 నాటికి మాత్రం ఆయన స్టార్‌డమ్ మరో స్థాయికి చేరుకుంది.

ఆ ఒక్క ఏడాదిలో శోభన్‌బాబు నటించిన 8 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. జనవరి 11న ‘దేవుడు చేసిన పెళ్లి’.. ఏప్రిల్ 11న ‘అందరూ మంచివారే’.. మే 2న ‘బాబు’.. మే 16న ‘జీవన జ్యోతి’.. జూలై 17న ‘బలిపీఠం’.. ఆగస్టు 14న ‘జేబుదొంగ’.. నవంబర్ 14న ‘గుణవంతుడు’.. డిసెంబర్ 19న ‘సోగ్గాడు’ విడుదలయ్యాయి. అంటే దాదాపు ప్రతి కొన్ని వారాలకోసారి శోభన్‌బాబు సినిమా థియేటర్లలోకి వచ్చింది.

ఈ ఎనిమిది సినిమాల్లో ‘దేవుడు చేసిన పెళ్లి’, ‘జీవన జ్యోతి’, ‘బలిపీఠం’, ‘జేబుదొంగ’, ‘సోగ్గాడు’ సినిమాలు ఘన విజయాలు సాధించాయి. ముఖ్యంగా ‘జీవన జ్యోతి’ 12 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ప్రదర్శితమైంది. ‘సోగ్గాడు’ అయితే 17 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ఆడింది. ‘దేవుడు చేసిన పెళ్లి’, ‘జేబుదొంగ’ కూడా ఘన విజయం సాధించాయి.

1975 చివర్లో వచ్చిన ‘సోగ్గాడు’ మాత్రం ఈ విజయాలన్నింటికీ మరో హైలైట్‌గా నిలిచింది. కె. బాపయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఏకంగా 17 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ప్రదర్శితమవడంతో పాటు.. శోభన్‌బాబుకు వరుసగా మూడో ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డును కూడా అందించింది. ఈ సినిమా తర్వాత శోభన్‌బాబు పేరుకు ముందు ‘సోగ్గాడు’ అనే పేరు కూడా అభిమానుల్లో బలంగా స్థిరపడింది.

ఇది కూడా చదవండి: బ్రాహ్మణ పాత్ర అనగానే గుర్తుకొచ్చే హీరో ఎవరు?

 

 

 

[Sobhan Babu Records, Sobhan Babu 1975 Movies, Sobhan Babu Movies, Soggadu Movie, Jeevana Jyothi Movie, Jebu Donga Movie, Balipeetam Movie, Devudu Chesina Pelli Movie, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com