
సిల్వర్ స్క్రీన్ కి మాస్ మసాలా దినుసులు అందించి అభిమానులు, ప్రేక్షకులని ఉర్రుతలుగించడంలో షారుఖ్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ దిట్ట.ఈ ముగ్గురితో కూడిన విమల్ ఎలాచీ ప్రకటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర ఆహార మరియు ఔషధ పరిపాలన శాఖ (FDA) ఈ ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముగ్గురు నటులకు ఇటీవల షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఈ నోటీసులకి సంబంధించి ఈ ముగ్గురు స్టార్స్ ఇప్పటికే తమ అధికారిక వివరణలని సమర్పించారని మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే స్పష్టం చేశారు. సరోగేట్ అడ్వర్టైజింగ్ (పరోక్ష ప్రకటనలు) విధానం ద్వారా నిషేధిత గుట్కా, పాన్ మసాలా ఉత్పత్తులను విమల్ ఎలాచీ పేరుతో ప్రచారం చేస్తున్నారనేది ఎఫ్‌డీఏ ప్రధాన ఆరోపణ. మహారాష్ట్రలో గుట్కా, పాన్ మసాలా విక్రయాలు చట్టరీత్యా నిషేధించబడిన దృష్ట్యా, ఇలాంటి ప్రకటనలు వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న ముగ్గురిలో ఇద్దరు నటులు వ్యక్తిగత విచారణ (హియరింగ్) కావాలని కోరగా, వారి విచారణ ప్రక్రియ కూడా విజయవంతంగా పూర్తయిందని కమిషనర్ తెలిపారు. ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం 2006 పరిధిలోని సెక్షన్ 24 మరియు సెక్షన్ 53 ప్రకారం ఈ చట్టపరమైన నోటీసులు జారీ చేయబడ్డాయి. సెక్షన్ 24 తప్పుదారి పట్టించే, మోసపూరిత ప్రకటనలను అడ్డుకోగా, సెక్షన్ 53 కింద తప్పుదారి పట్టించే ప్రకటనల్లో భాగస్వాములైన వారికి గరిష్టంగా ₹10 లక్షల వరకు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. నోటీసు జారీ చేసిన సమయం నుండి 15 రోజుల వ్యవధిలో తమ అగ్రిమెంట్లు, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్ పత్రాలు మరియు డ్యూ డిలిజెన్స్ ఆధారాలు సమర్పించాలని గతంలో ఎఫ్‌డీఏ ఆదేశించింది.
ఒక బ్రాండ్‌ను ప్రచారం చేసేటప్పుడు సదరు ప్రచారకర్తలు తమ సామాజిక బాధ్యతను మరిచిపోకూడదని, తాము ఎలాంటి ఉత్పత్తిని ప్రచారం చేస్తున్నామో సమగ్రంగా పరిశీలించుకోవాల్సిన బాధ్యత (డ్యూ డిలిజెన్స్) వారిపైనే ఉంటుందని ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. చట్టం ముందు అందరూ సమానులేనని, ఎంతటి పెద్ద నటులైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కమిషనర్ ముంధే వ్యాఖ్యానించారు. ఈ కేసులో తదుపరి చట్టపరమైన చర్యలను వేగవంతం చేస్తున్నట్లు ఎఫ్‌డీఏ వెల్లడించింది.అభిమానుల నుండి విమర్శలు వచ్చిన తర్వాత బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గతంలోనే ఈ బ్రాండ్ ఒప్పందం నుండి తప్పుకుని బహిరంగంగా క్షమాపణలు చెప్పగా, అనంతరం టైగర్ ష్రాఫ్ ఈ ప్రచారంలోకి వచ్చారు. ఇప్పుడు అగ్ర నటులైన షారుఖ్, అజయ్, టైగర్‌లకు ఎఫ్‌డీఏ నోటీసులు ఇవ్వడం, వారు సమాధానాలు ఇవ్వడం బాలీవుడ్ వర్గాల్లో మరియు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఎఫ్‌డీఏ ముందుకు తీసుకునే నిర్ణయాలు సెలబ్రిటీ ఎండోర్స్‌మెంట్ నిబంధనలకు అత్యంత కీలకమైన మార్గదర్శకంగా మారనున్నాయి.
[vimal Elaichi Ad Controversy Shah Rukh Khan And Ajay devgn Fda Notice,Vimal Elaichi controversy, Shah Rukh Khan FDA notice, Ajay Devgn pan masala ad, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tolywood News]




