బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలతో పాటు టెలివిజన్‌లోనూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఇప్పుడు ఆయన డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టి సరికొత్త యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. ‘బీయింగ్ సల్మాన్ ఖాన్’ పేరుతో మొదలైన ఈ ఛానల్‌లో ఆయనకు సంబంధించిన వీడియోలు వస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ కంటెంట్ పెద్దవాళ్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించింది కాదని సల్మాన్ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తన యూట్యూబ్ ఛానల్‌ను చూసిన ప్రేక్షకులకు సల్మాన్ ఖాన్ తాజాగా ఓ సందేశం ఇచ్చారు. “నా యూట్యూబ్ ఛానల్‌ను చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ కంటెంట్ ప్రస్తుతం మీ కోసం కాదని నాకు తెలుసు. కానీ మీ చిన్నారుల కోసం రూపొందించిందని మీరు కూడా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఇది ఎలా ముందుకు సాగుతుందో చూద్దాం” అని పేర్కొన్నారు. పిల్లలకు వినోదంతో పాటు ప్రేమ, కుటుంబ విలువలు, విద్య కూడా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ఛానల్‌లో సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో నటనకు సంబంధించిన పాఠాలను పరిచయం చేస్తున్నారు. ఒక వీడియోలో ఆయన రెండు పాత్రల్లో కనిపిస్తారు. ఒక పాత్రలో నటన, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విషయాలు నేర్పించే కోచ్‌గా.. మరో పాత్రలో వాటిని నేర్చుకునే విద్యార్థిగా కనిపిస్తారు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, నటనలో తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన హావభావాలను సరదాగా వివరిస్తున్నారు. పిల్లలు వినోదం పొందుతూనే కొత్త విషయాలు నేర్చుకునేలా ఈ వీడియోలను రూపొందిస్తున్నారు. ఈ ఛానల్‌ను సెప్టెంబర్ 22న ప్రారంభించినట్లు సమాచారం.
ఇక సల్మాన్ ఖాన్‌కు యూట్యూబ్‌లోకి రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో ‘సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ మ్యూజిక్’ ఛానల్ ద్వారా తన సినిమాల్లోని పాటలు, ఇతర సంగీతాన్ని ప్రేక్షకులకు అందించారు. ప్రస్తుతం ‘బిగ్ బాస్ 20’కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆయన.. మరోవైపు ‘మాతృభూమి’ చిత్రంలోనూ కనిపించనున్నారు. అయితే కొత్త యూట్యూబ్ ఛానల్ ద్వారా పిల్లలను లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తున్న కంటెంట్‌కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
[Salman Khan, Being Salman Khan, Salman Khan YouTube Channel, Salman Khan Latest News, Salman Khan Kids Content, Salman Khan Acting Lessons, Salman Khan YouTube Videos, Bollywood News]




