బాలీవుడ్ స్టార్ బ్యూటీ, నటి ఆలియా భట్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయంతో హాట్ టాపిక్‌గా నిలుస్తూనే ఉంటుంది. తాజాగా ఈ స్టార్ హీరోయిన్ ఒక పబ్లిక్ వేదికపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలోనూ తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. భారతదేశంలో మహిళా ప్రాధాన్యత కలిగిన యాక్షన్ చిత్రాలకు తానే ‘పయనీర్’ అన్నట్లుగా మాట్లాడిన ఆలియా వీడియో క్లిప్ ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ కామెంట్స్ చూసిన నెటిజన్లు ఆమెపై రకరకాల పంచ్‌లు, సెటైర్లతో దారుణంగా విరుచుకుపడుతున్నారు.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. భారతదేశంలో విమెన్ సెంట్రిక్ యాక్షన్ సినిమాలకు తానే పునాది వేసినట్లు సోషల్ మీడియాలో వచ్చే కామెంట్ల గురించి హోస్ట్ అడగగా, ఆ క్రెడిట్‌ను ఆలియా ఎంతో సంతోషంగా అంగీకరించేసింది. దీంతో నెటిజన్లు ఆమెను ‘నెపో క్వీన్’ అంటూ దారుణంగా ఎగతాళి చేస్తున్నారు. యాక్షన్ జానర్‌లో తనకు మించిన వారు లేరన్నట్లుగా ఆలియా ప్రవర్తించడం చూసి, తోటి మరియు సీనియర్ నటీమణులను గౌరవించడం ఆమెకు అస్సలు తెలియదంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో యాక్షన్ సినిమాలతో మెప్పించిన ఎందరో దిగ్గజ నటీమణుల పేర్లను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే అదిరిపోయే స్టంట్స్‌తో అదరగొట్టిన 'ఫియర్‌లెస్ నాడియా' మొదలుకొని.. హేమమాలిని, విజయశాంతి, శ్రీదేవి, రేఖ వంటి సీనియర్ స్టార్లు ఎందరో మహిళా ప్రాధాన్యత కలిగిన యాక్షన్ చిత్రాల్లో రాణించారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆలియా కంటే ముందే వీరంతా ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించారని నెమరువేస్తున్నారు.
కేవలం సీనియర్లు మాత్రమే కాదు, సమకాలీన నటీమణులైన ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్, దీపికా పదుకోన్, కత్రినా కైఫ్, తాప్సీ వంటి వారు కూడా కళ్ళు చెదిరే యాక్షన్ సీన్లతో ప్రేక్షకులను అలరించారని సోషల్ మీడియాలో ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు. వీరెవ్వరూ కానట్టు కేవలం ఆలియా భట్ మాత్రమే యాక్షన్ చిత్రాలకు ఆద్యురాలిగా క్రెడిట్ తీసుకోవాలని చూడటం హాస్యాస్పదంగా ఉందని మండిపడుతున్నారు.
సాధారణంగానే ఇండస్ట్రీలో నెపోటిజంపై వచ్చే విమర్శల వల్ల ఆలియా భట్ తరచూ ట్రోలింగ్ ఎదుర్కొంటూనే ఉంటుంది. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ చరిత్రనే మార్చేసి, తానే యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకోవడం ఈ నేపోకిడ్ అహంకారానికి నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది సాధించిన విజయాలను కనీసం గుర్తించకుండా ఆలియా ఇలా నోరు జారడంపై సోషల్ మీడియా వేదికగా జనం పంచ్‌ల మీద పంచ్‌లు వేస్తున్నారు.
ప్రస్తుతం ఆలియా భట్ నటించిన ప్రతిష్టాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆల్ఫా’ (Alpha) విడుదలకు సిద్ధమవుతోంది. యష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ భారీ స్పై థ్రిల్లర్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆలియా బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలలో హోస్ట్‌లు అడిగే కొన్ని ప్రశ్నలకు తడబడుతూ ఇలా నెటిజన్లకు దొరికిపోతోందన్నమాట. మరి రాబోయే రోజుల్లో ఈ వివాదంపై ఆలియా ఎలా స్పందిస్తుందో చూడాలి!




