Home

»

Bollywood News

బిజినెస్ టైకూన్‌గా ఆమిర్ ఖాన్.. ప‌ర్‌ఫెక్ట్ ప్లానింగ్‌లో ఉన్న‌ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌!

Apr 17, 2026

బాలీవుడ్ మిస్టర్ ప‌ర్‌ఫెక్ట్ ఆమిర్‌ ఖాన్ సినిమా వస్తుందంటే చాలు.. అది దేశవ్యాప్తంగా ఒక సంచలనం. కథా బలమున్న చిత్రాలను ఎంచుకోవడంలో ఆమిర్‌స్టైలే వేరు. అయితే గత కొంతకాలంగా ఈ స్టార్ హీరో ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోతున్నారు. ‘లాల్ సింగ్ చద్దా’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడం, ‘సితారే జమీన్ పర్’ యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో.. ఈసారి ఎలాగైనా భారీ కంబ్యాక్ ఇవ్వాలని ఆమిర్‌ పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టినట్లు టాక్.

తాజా సమాచారం ప్రకారం.. ఆమిర్‌ ఖాన్ మరో ప్రతిష్టాత్మక బయోపిక్‌కు సిద్ధమవుతున్నారట. ప్రముఖ స్టార్టప్ దిగ్గజం, 'భారత్ పే' (BharatPe) కో-ఫౌండర్ అష్నీర్ గ్రోవర్ జీవిత చరిత్ర ఆధారంగా ఒక సినిమా చేసేందుకు ఆమీర్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అష్నీర్ గ్రోవర్ ప్రస్థానం, ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, స్టార్టప్ ప్రపంచంలో ఆయన సృష్టించిన సంచలనం.. ఇలాంటి అంశాలన్నీ వెండితెరపై ఆవిష్కరిస్తే ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని ఆమిర్‌ భావిస్తున్నారట.

నిజానికి బయోపిక్‌లు ఆమిర్‌ ఖాన్‌కు అచ్చొచ్చిన ఫార్మాట్. గతంలో వచ్చిన ‘దంగల్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. హర్యానా మల్లయోధుడు మహావీర్ సింగ్ ఫోగట్ పాత్రలో ఆమిర్ పరకాయ ప్రవేశం చేసి మెప్పించారు. ఆ సినిమా సాధించిన రికార్డులను ఇప్పటికీ చాలా సినిమాలు అధిగమించలేకపోయాయి. ఇప్పుడు మళ్లీ అష్నీర్ గ్రోవర్ వంటి వివాదాస్పద మరియు ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న బిజినెస్ మెన్ కథను ఎంచుకోవడం వెనుక ఆమిర్ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

అష్నీర్ గ్రోవర్ కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు.. 'షార్క్ ట్యాంక్ ఇండియా' షో ద్వారా ఇంటింటికీ చేరువయ్యారు. ఆయన మాట్లాడే తీరు, నిర్మొహమాటమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాయి. ఇలాంటి ఒక డైనమిక్ క్యారెక్టర్‌ను ఆమిర్‌ పోషిస్తే స్క్రీన్ మీద హై ఓల్టేజ్ డ్రామా గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివర్లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

షారుఖ్ ఖాన్ వరుస హిట్లతో దూసుకుపోతుంటే.. ఆమిర్‌ మాత్రం సరైన బ్రేక్ కోసం వేచి చూస్తున్నారు. ఈ తరుణంలో స్టార్టప్ ప్రపంచం నేపథ్యంలో వచ్చే ఈ బయోపిక్ ఆయన కెరీర్‌కు మైలేజ్ ఇస్తుందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఒక సాదాసీదా వ్యక్తి స్టార్టప్ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు? తర్వాత వచ్చిన వివాదాలేంటి? అన్న కోణంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మిస్టర్ ప‌ర్‌ఫెక్ట్ నుంచి వచ్చే అధికారిక అప్‌డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com