English | Telugu

ఇది వ‌ర‌కు క‌థ‌లు ఆలోచ‌న‌ల్లోంచి పుట్టుకొచ్చేవి. ఆ త‌ర‌వాత బ్యాంకాక్ బీచ్‌ల‌లోనూ, మ‌లేసియా వీధుల్లోనూ, ఖ‌రీదైన హోట‌ల్ల‌లోని నాలుగు గోడ‌ల మ‌ధ్య క‌థ‌లు పుట్ట‌డం మొద‌లైంది. ఇప్పుడు అంత శ్ర‌మ ప‌డ‌క్క‌ర్లెద్దు. నాలుగు డీవీడీలు ముంద‌రేసుకొని మిక్సీ చేసే టాలెంట్ ఉంటే.. క‌థ‌లు ఎన్నయినా రాయొచ్చు.. ఎన్న‌యినా తీయొచ్చు. కానీ... అలా తీసిన వండిన క‌థ‌లోనూ త‌మ‌దైన ముద్ర వేయాల‌న్న త‌ప‌న ఉండాలి. కామెడీతోనో, థ్రిల్లింగ్ తోనో, టేకింగ్ తోనో మాయ చేసే నేర్పు తెలిసుండాలి. కాష్మోరా కూడా నాలుగైదు పాత సినిమాల‌తో వండిన క‌థే. కానీ.. దాంట్లో వేసిన దినుసులే వేరు. అదే ఈ సినిమాకి కొత్త ఫ్లేవ‌ర్ తీసుకొచ్చింది. ఇంత‌కీ కాష్మోరా ఏటైపు సినిమా..? ఎవ‌రికి న‌చ్చుతుంది? తెలుసుకోవాలంటే స‌మీక్ష‌లోకి వెళ్లాల్సిందే.

* క‌థ :

కాష్మోరా (కార్తి) దెయ్యాల్నీ, ఆత్మ‌ల్నీ వ‌శం చేసుకొంటా.. అంటూ మోసం చేసి డ‌బ్బులు సంపాదిస్తుంటాడు. అత‌ని గార‌డీకి అంద‌రూ ప‌డిపోతుంటారు. యామిని (శ్రీ‌దివ్య‌) దెయ్యాల‌పై రీసెర్చ్ చేస్తుంటుంది. కాష్మోరా ద‌గ్గ‌ర చేరి.. ఆత్మ‌ల‌కు సంబంధించిన విష‌యాలు తెలుసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటుంది. త‌న మాయ మాట‌ల‌తో ఓ రాజ‌కీయ నాయ‌కుడ్ని కూడా బుట్ట‌లో వేసుకొంటాడు కాష్మోరా.

కాష్మోరా మాయ‌లో ప‌డి.. రూ.500 కోట్ల విలువైన న‌గ‌లు, డ‌బ్బు కాష్మోరా ద‌గ్గ‌ర దాస్తాడు. అయితే స‌మ‌యం చూసుకొని ఆ డ‌బ్బుతో ఉడాయిస్తుంది కాష్మోరా కుటుంబం. అలా.. విదేశాలకు వెళ్లి స్థిర‌ప‌డాల‌నుకొంటున్న కాష్మోరా కుటుంబాన్ని.. రాజ్ నాయ‌క్ (కార్తి) అనే ఆత్మ అడ్డుకొని... త‌న కోట‌కు ర‌ప్పించుకొంటుంది. ఆ కోట‌కు 900 సంవ‌త్స‌రాల చ‌రిత్ర ఉంటుంది. ఆ కోట‌లో రాజ్‌నాయ‌క్ ఆత్మ తిరుగుతుంటుంది.


రాజ్ నాయ‌క్ ఎవ‌రో కాదు..విక్రాంత రాజ్యం సైన్యాధ్య‌క్షుడు. ఆ రాజ్యానికి యువ‌రాణి అయిన ర‌త్న మ‌హాదేవి (న‌య‌న‌తార‌)ని మోహిస్తాడు. వారిద్ద‌రి క‌థేంటి?? అస‌లు రాజ్ నాయ‌క్ ఆత్మ‌కి కాష్మోరాతో ప‌నేమిటి? ఇవ‌న్నీ వెండి తెర‌పై చూడాల్సిందే.

* విశ్లేష‌ణ‌

కాష్మోరా క‌థ చూస్తే ఒక‌టి కాదు.. చాలా చాలా తెలుగు సినిమాలు మ‌న క‌ళ్ల‌ముందు క‌ద‌లాడ‌తాయి. మ‌గ‌ధీర‌, అరుంధ‌తి ఛాయ‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. అరుంధ‌తి ఎపిసోడ్‌ని యాజ్ టీజ్‌గా దింపేసే ప్ర‌య‌త్నం చేశాడు గోకుల్. న‌య‌న‌తార - కార్తిల మ‌ధ్య ప‌గ‌.. అరుంధ‌తి ఎపిసోడ్ ని త‌ల‌పిస్తుంది. అయితే.. వీటిపై వినోద‌పు పూత పూసి మాయ చేశాడు ద‌ర్శ‌కుడు. తొలిభాగం కేవ‌లం కార్తి పాత్ర‌ని ఎలివేట్ చేసుకొంటూ వ‌చ్చాడు. క‌థేం న‌డ‌వ‌క‌పోయినా.. కార్తి త‌న టాలెంట్‌తో మాయాజాలం చేశాడు. దొంగ బాబాగా కార్తి చేసిన ప్ర‌తీ ప‌ని... న‌వ్విస్తుంది. కోట‌లోకి అడుగుపెట్టిన త‌ర‌వాత క‌థ మ‌రో స్థాయికి వెళ్తుంది. అక్క‌డి నుంచే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. విశ్రాంతికి ముందొచ్చే స‌న్నివేశాలు హిలేసిరియ‌స్‌గా న‌వ్విస్తాయి.

తెర‌పై కార్తి ఒక్క‌డే క‌నిపిస్తాడు. కానీ.. మ‌న‌కు బోర్ కొట్ట‌దు. ద‌ర్శ‌కుడు గోకుల్ ప‌నిత‌నం ఈ స‌న్నివేశాల్లో బాగా క‌నిపించింది. కార్తి కూడా రెచ్చిపోయాడు. ద్వితీయార్థం కాస్త నెమ్మ‌దించిన‌ట్టు అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్‌తో మ‌ళ్లీ కాస్త స్పీడు వ‌స్తుంది. అరుంధ‌తి టైపు ఫ్లాష్ బ్యాక్ మ‌న‌కు కాక‌పోయినా త‌మిళ ప్రేక్ష‌కుల‌కు కొత్త‌గానే ఉంటుంది. క్లైమాక్స్ పై కూడా అరుంధ‌తి ప్ర‌భావం ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. అయితే.. అక్క‌డ గోకుల్ త‌న‌దైన కామెడీ స‌న్నివేశాల‌తో మ‌ళ్లీ ర‌క్తి క‌ట్టించాడు. మొత్తానికి ఇటీవ‌ల వ‌చ్చిన చాలా సినిమాల్లానే ఇదీ ఓ కోట చుట్టూ తిరిగే క‌థ‌. అయితే అందులోనే అన్ని జోన‌ర్ల‌నూ మిక్స్ చేసి కాల‌క్షేపానికి ఢోకా లేకుండా చేశాడు ద‌ర్శ‌కుడు.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

కాష్మోరా అనేది కార్తి వ‌న్ మ్యాన్ షో. సినిమా మొత్తం త‌నే క‌నిపిస్తాడు. త‌నే ముందుండి నడిపించాడు. కాష్మోరా పాత్ర‌లో ఎంత న‌వ్విస్తాడో... రాజ్ నాయ‌క్‌గా అంత భ‌య‌పెడ‌తాడు. ఒక విధంగా ఈసినిమాకి హీరో, విల‌న్ రెండూ కార్తీనే. కోట‌లోకి అడుగుపెట్టినప్పుడు కార్తి పండించిన వినోదం... ఈ సినిమా మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. న‌య‌న‌తార ఎపిసోడ్ కాసేపే. ఈ పాత్ర‌కు తాను మాత్ర‌మే యాప్ట్ అనే రీతిలో న‌టించింది. క్లైమాక్స్‌లో కార్తి - న‌య‌న ఫైట్ ఓ ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌. ఈ పాత్ర‌పై ద‌ర్శ‌కుడు ఇంకాస్త దృష్టి పెట్టుంటే బాగుండేది. కానీ రాజ్ నాయ‌క్ పాత్ర‌ని హైప్ చేయ‌డం కోసం రాణీ ర‌త్న‌మ‌హాదేవి పాత్ర‌ని అండ‌ర్ ప్లే చేయాల్సివ‌చ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ లేనట్టే. శ్రీ‌దివ్య పాత్ర ప‌రిధి చాలా త‌క్కువ‌. వివేక్ కూడా కార్తితో పోటీ ప‌డి న‌వ్వించాడు. సెటైరిక‌ల్ కామెడీతో.. స‌న్నివేశాల్ని పండించాడు. కార్తి త‌ర‌వాత ఆ స్థాయిలో కామెడీ చేసింది వివేక్‌నే. ఆ పాత్ర‌కు ఇచ్చిన డ‌బ్బింగ్ కూడా బాగుంది.

* సాంకేతిక విభాగం

ఈ సినిమాలో రెండే రెండు పాట‌లున్నాయి. అవీ విన‌సొంపుగా లేవు. సాహిత్యం అస్స‌లు అర్థం కాదు. అయితే నేప‌థ్య సంగీతం మాత్రం బాగుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌, హార‌ర్ మూమెంట్స్ లో సంతోష్ నారాయ‌ణ్ నేప‌థ్య సంగీతం బ‌లం క‌నిపిస్తుంది.. వినిపిస్తుంది. టెక్నిక‌ల్‌గా ఈ సినిమా బాగుంది. విజువ‌ల్ ఎఫెక్ట్స్ కోసం బాగానే ఖ‌ర్చు పెట్టారు. కోట‌, రాజ ద‌ర్బార్ వీటికి సంబంధించిన స‌న్నివేశాలు బాగా వ‌చ్చాయి. కెమెరామెన్‌, క‌ళాద‌ర్శ‌కుల ప‌నిత‌నానికి ఈ సినిమా అద్దం ప‌ట్టింది. ఈ సినిమాలో ట్రిమ్ చేయాల్సిన స‌న్నివేశాలు కొన్ని ఉన్నాయి. అక్క‌డ‌క్క‌డ సాగ‌దీత ధోర‌ణి క‌నిపిస్తుంది. కొన్ని విష‌యాల్లో క్లారిటీ మిస్ అయ్యింది. కొన్ని డైలాగులు అర్థం కాలేదు. ఎడిట‌ర్ త‌న క‌త్తెర‌కు ఇంకాస్త ప‌ని చెప్పొచ్చు.

రేటింగ్ : 2.5