సీమలో జగన్ కు షాక్.. కష్టమే..
Publish Date:Jan 14, 2018
Advertisement
ఒకపక్క జగన్ పాదయాత్రలు చేస్తూ బిజీగా గడుపుతుంటే.. మరోపక్క పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాత్రం సర్వేలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ఎన్నో సర్వేలు చేసిన.. ఆయన తాజాగా మరో సర్వే చేశాడు. ఎప్పటిలాగానే ఈ సర్వేలో కూడా ఆయనకు షాకింగ్ విషయాలే బయటపడ్డాయి. డిసెంబర్ నెల మూడోవారంలో రాయలసీమలో నిర్వహించిన సర్వేలో వైసీపీకి మింగుడుపడని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది. అదేంటంటే.. వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో కూడా జగన్ కు అనుకున్న ఫలితాలు రావంట. అసలు జగన్ కు రాయలసీమనే పెద్ద బలం. గత సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఎక్కువ స్థానాల్లో గెలిచింది కూడా ఇక్కడినుండే. వైసీపీ సాధించిన మెజార్టీ స్థానాలు ఇక్కడివే. ఇక్కడి గెలిచిన స్థానాల కారణంగానే వైసీపీ స్కోరు 65 దాటింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. జగన్ పై పెరుగుతున్న వ్యతిరేకత ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కరువుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న రాయసీమకు నీరు అందించడం ముఖ్య కారణాలుగా నిలవడంతో... ఈసారి పదిస్థానాల కంటే ఎక్కువ రావని పీకే సర్వేలో తేలిందట. దీంతో జగన్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు రాయలసీమలోని నియోజకవర్గాల సమన్వయకర్తలతో చర్చలు జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలను మార్చేందుకు కూడా జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సర్వేలోనే మరికొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయట. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి, రోజా వంటి వారికి కూడా గడ్డు పరిస్థితులే ఉన్నాయని తేలినట్టు సమాచారం. పార్టీ రాయలసీమ విభాగంలో సమూలమైన మార్పులు తీసుకొస్తే తప్ప ఈ పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం లేదని ఆ పార్టీ సీనియర్ నేతలు జగన్ కు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి చూద్దాం...ఎన్నికల సమయానికి సర్వేలు ఇలానే ఉంటాయో..అప్పటికీ పరిస్థితి ఇలాగే ఉంటుందో.. లేదో..?
http://www.teluguone.com/news/content/jagan-45-79752.html





