జగన్ తీరు: వైసీపీ బేజారు.!
Publish Date:Nov 6, 2026
Advertisement
రాజకీయ పార్టీల మనుగడకు సమర్ధ నాయకత్వం అవసరం. నాయకుడు ముందుండి పార్టీని నడిపిస్తేనే పార్టీ ముందుకు సాగుతుంది. అంతే కానీ, నాయకుడు ప్యాలెస్ లో కూర్చుని కొరడాతో అదిరిస్తాననే అహంకార ధోరణి ప్రదర్శిస్తే ఆ పార్టీకి పురోగతి ఉండదు. ఇప్పుడు వైసీపీ పరిస్థితి అదే. అంతే కాదు.. నాయకుడుకి పార్టీ జెండామోసే కార్యకర్తలకు దూరం ఎంతగా పెరిగితే, పార్టీ అంతగా నష్ట పోతుంది. ఇప్పుడు వైసీపీ గురించి చెప్పుకోవాలంటే నాయకుడికి సమర్ధతా లేదు.. ఆయనది కార్యకర్తలతో మమేకమయ్యే తీరు కాదు. ఔను నిజం. వైఎస్ జగన్మోహనరెడ్డి తీరు నేను ఆదేశిస్తాను, మీరు పాటించండి అన్న చందంగా ఉంటుంది. ఆ కారణంగానే ఆయన అటు ప్రజలతోనూ, ఇటు పార్టీ కార్యకర్తలతోనూ మమేకం కాలేకపోతున్నారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పార్టీ క్యాడర్ కు అందుబాటులో, ప్రజలకు దగ్గరగా మెలగాల్సిన జగన్ ప్యాలెస్ కే పరిమితమౌతున్నారు. దీంతో పార్టీ నేతలూ, కార్యకర్తలూ అయోమయంలో పడిపోతున్నారు. సమకాలీన రాజకీయ నాయకులలో వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిది ఓ విలక్షణ శైలి. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లంటారు. కాదంటే ఒప్పుకోరు. ఒక్కోసారి అదే కుందేటికి ఐదు కాళ్లనడానికీ ఇసుమంతైనా సందేహించరు. తాను ఏది చెప్పినా అందరూ విని తీరాలంటారు. నమ్మి తీరాలంటారు. వైసీపీలో ఆయన కోటరీ జగన్ రెడ్డి తీరును సరిగ్గా అర్ధం చేసుకుంది. దీంతో ఆయన ఓటములను కూడా ప్రత్యర్థుల పరాజయాలుగా అభివర్ణిస్తూ.. ఓ ప్రత్యేక శైలిలో కథనాలు వండి వారుస్తుంటారు. ఆ కథనాలను ప్రసారం చేయడానికీ, ప్రచురించడానికీ, ప్రచారం చేయడానికి జగన్ రెడ్డికి సొంత మీడియా, సోషల్ మీడియా వింగ్ లు ఉన్నాయి. సరే 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత నుంచి జగన్మోహన్ రెడ్డి సందర్భం ఉన్నా లేకున్నా 2029 ఎన్నికలలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది. తాను సీఎంను అవుతాను అన్నమాటే వల్లె వేస్తున్నారు. ఆయన మరోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టరు. జనం ఆయనను నమ్మి మరోసారి అధికారం అప్పగిస్తే దానినీ ఎవరూ తప్పుపట్టరు. కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి.. రాష్ట్రంలో మాత్రం వారిని ఒక రోజే, మహా అయితే రెండు రోజులకు మించి మకాం వేయరు. ఇలా వచ్చి అలా బెంగళూరు వెళ్లిపోతుంటారు. ఇది కూడా చదవండి: జగనన్నా నిన్ను నమ్మలేమన్నా! మామూలుగా జగన్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే.. బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ గు ప్రతి గురువారం వచ్చి.. ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఆ సమావేశంలో రాసుకొచ్చిన స్క్రిప్ట్ చదివేసి, ఏపీకి వచ్చిన పనైపోయిందన్నట్లుగా బెంగళూరు ఉడాయించేస్తుంటారు. ఎప్పుడో పరామర్శలకో, ఓదార్పు యాత్రలకో మాత్రం ఈ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు ఉంటాయి. అంతే అంతకు మించి మిగతాదంతా సేమ్ టూ సేమ్. అదే విధంగా ఆయన గురువారం (నవంబర్ 5) ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల తీరును తూర్పారపట్టారు. అధికార తెలుగుదేశం కూటమి దౌర్జన్యాలకు పాల్పడిందంటూ దుయ్యబట్టారు. తమ పార్టీ వారిని ఓటు వేయకుండా అడ్డుకుందన్నారు. అంతే పరిషత్ ఎన్నికల సందర్భంగా పులివెందుల వంటి కొన్ని చోట్ల జరిగిన అరకొర హింసాత్మక సంఘటనలను జాతీయ స్థాయి సమస్యలుగా అభివర్ణించి మీడియా సమావేశం ముగించి బెంగళూరు వెళ్లిపోయారు. నాయకుడి తీరు ఈ రీతిగా ఉంటే వైసీపీ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని ఆ పార్టీ శ్రేణుల్లోనే ఆందోళన వ్యక్తమౌతోంది. ఇప్పటికే ఆ పార్టీలో చాలా మంది సీనియర్లు సైలెంట్ అయిపోవడమో, రాజకీయ భవిష్యత్ కోసం ఇతర పార్టీలలోకి జంప్ చేయడమో, చేయడానికి ప్రయత్నాలలోనో ఉన్నారు. మీకు నచ్చవచ్చు: జగన్‌కి సీఎం అపాయింట్‌మెంట్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా? కంగ్రాట్స్ టీమ్ సీబీఎన్ అంటూ ట్వీట్: పుర పోరులో ఓటమిపై జగన్ అక్కసు.! [YS Jagan politics Conine Palace, Distance, Party Cader, Pressmeets, Troll Material, Telugu One]
http://www.teluguone.com/news/content/ys-jagan-politics-conine-palace-45-236456.html




