చిదంబరమే కాంగ్రెస్ కొంపముంచాడుట!
Publish Date:Nov 11, 2014
Advertisement
సార్వత్రిక ఎన్నికలు జరిగి ఆరు నెలలవుతున్నా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఓటమికి కొత్త కొత్త కారణాలు ఏవో ఒకటి బయటపడుతూనే ఉండటం విశేషం. ఇంతవరకు యూపీయే అవినీతి, అసమర్ధ పాలన, కుంభకోణాలు, మోడీ ప్రవేశం, రాహుల్ గాంధీ అసమర్ధత, రాష్ట్ర స్థాయిలో అంతర్గత కుమ్ములాటలు వంటి కారణాలు మాత్రమే చెప్పుకొనే భాగ్యం కలిగింది. కానీ సీనియర్ కాంగ్రెస్ నేత హెచ్.ఆర్.భరద్వాజ మరో కొత్త కారణం బయటపెట్టారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం మాజీ ఆర్ధికమంత్రి చిదంబరమేనని తేల్చిచెప్పారు. అందుకు ఆయన బలమయిన కారణాలు కూడా చెప్పారు. 2జి స్కాంపై విచారణ వద్దని ఆయన అడ్డుపడటం వలననే, అందులో కాంగ్రెస్ హస్తం ఉందనే భావన ప్రజలలో వ్యాపించిందని, దాని వలన పార్టీకి తీరని అప్రతిష్ట ఏర్పడి చివరికి అది ఎన్నికలలో ఓటమికి కారణమయిందని ఆయన కనిపెట్టి చెప్పారు. అందువల్ల ఈ స్కాంలో అంతా చిదంబర మహత్యమే తప్ప ఎక్కడా కూడా యూపీయే హ్యాండ్ కానీ కాంగ్రెస్ హ్యాండ్ గానీ లేదని, కానీ చిదంబరం చేసిన పనికి కాంగ్రెస్ బలయిపోయిందని ఆయన వాపోయారు. పనిలోపనిగా ఆయన ‘మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ నిజాయితీని ఎవరూ శంఖించలేరని’ ఒక కాండక్టు సర్టిఫికేట్ కూడా జారీ చేసారు. అయితే తమిళనాడుకే చెందిన మాజీ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రులు దయానిధీ మారన్ మరియు ఏ. రాజ ఇద్దరూ కూడా 2జి స్కాం క్రింద నుండి పైవరకు అందరికీ తెలిసే జరిగిందని, ఇందులో దాచుకోవడానికి ఏమి లేదని కుండ బ్రద్దలు కొట్టినప్పుడు, ఒక్క చిదంబరానికే ఆ క్రెడిట్ అంతా కట్టబెట్టేయాలని భరద్వాజ్ అనుకోవడం చాలా సంకుచిత ఆలోచనగా చెప్పక తప్పదు. డా. మన్మోహన్ సింగ్ యొక్క మౌనం అర్ధాంగీకారంగా భావించినందునే ఈ స్కాం జరగడానికి ఆస్కారం ఏర్పడింది. కనుక ఆయనతో సహా అందరూ కూడా తిలా పాపం తలా పిడికెడు స్వీకరించక తప్పదు. ఏమయినప్పటికీ ఇప్పుడు భరద్వాజ్ చెప్పబట్టి ఈ స్కాంలో చిదంబరం రోల్ ఏమిటనేది ప్రజలకు కూడా తెలుసుకొనే భాగ్యం కలిగింది. అందువల్ల ఆయనకు కృతజ్ఞతలు చెప్పవలసిందే.
http://www.teluguone.com/news/content/hl-bharadwaj-45-40114.html





