కళ్యాణ లక్ష్మీ కాసుల కోసం..కట్టుకున్న భార్యకి రెండు పెళ్ళిళ్ళు
Publish Date:Apr 5, 2016
Advertisement
ఆడపిల్ల పుడితే భారంగా భావించే తల్లిదండ్రులకు బాసటగా నిలిచేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మీ పథకం దళారుల చేతిలో పడి తన విలువను కోల్పోతోంది. కళ్యాణ లక్ష్మీ పథకం కింద ప్రభుత్వం ఇచ్చే డబ్బుకు కక్కుర్తి పడి కట్టుకున్న భార్యకు మరొకరితో వివాహాం చేశాడు ఒక ప్రబుద్ధుడు. ఇటు అధికారుల పరిశీలనా , పర్యవేక్షణ రెండూ లోపించడంతో కేటుగాళ్లు ప్రభుత్వ సొమ్మును అడ్డంగా దోచేస్తున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని పాల్తితండాకు చెందిన వీరాసింగ్-ధనకు 16 సంవత్సరాల క్రితం వివాహం జరిగి నలుగురు పిల్లలున్నారు. కళ్యాణ లక్ష్మీ పథకాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించాలని దంపతులిద్దరూ ప్లాన్ గీశారు. దీనికి తన బావ అయిన చందులాల్ సాయం తీసుకున్నారు. ప్లాన్ ప్రకారం వీరాసింగ్ తన భార్య ధనను నాంపల్లి మండలం కేశవనాయక్ తండాకు చెందిన రమావత్ సురేష్ కు మే 25, 2015లో వివాహం చేసినట్టు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి రూ.51వేలను గ్రామీణ వికాస్ బ్యాంక్, పెద్దవూరలో ధన ఖాతా నుంచి డ్రా చేశారు. తిరిగి 20రోజుల వ్యవధిలోనే ధనకు పుల్లిచర్ల గ్రామపంచాయతీ పరిధిలోని బాసోనిబాయితండాకు చెందిన బాణావత్ స్వామితో 14జూన్, 2015లో మరోమారు వివాహం జరిగినట్లు నకిలీ దరఖాస్తు సృష్టంచి పెద్దవూర అంధ్రా బ్యాంకు నుంచి మరో రూ.51వేలు డ్రా చేశారు. దీనిపై అనుమానమొచ్చిన అధికారులు విచారణ చేపట్టగా ఒకే మహిళకు రెండు పెళ్లిళ్లు చేసి రూ.1.02 లక్షలు డ్రా చేసినట్టు తేలింది. దీంతో వీరాసింగ్-ధనలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కీలక సూత్రధారి అయిన చందులాల్ పరారీలో ఉన్నాడు. పేదింటి ఆడపిల్లల్ని ఆదుకోవాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం అధికారుల నిర్లక్ష్యం కారణంగా అసలైన లబ్థిదారులకు కాకుండా మోసగాళ్లకి వరంగా మారుతోంది.
http://www.teluguone.com/news/content/government-of-telangana-45-57983.html





