గ్రేటర్ ఎన్నికలకు టీఆర్ఎస్ రెడీ
Publish Date:Jan 23, 2015
Advertisement
ఏప్రిల్ నెలలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ (జి.హెచ్.యం.సి.) ఎన్నికలు నిర్వహించాలను కొంటున్నట్లు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. తెదేపా నుండి తెరాసలో చేరి మంత్రి పదవి స్వీకరించిన శ్రీనివాస్ యాదవ్ రాజీనామాను స్పీకర్ ఆమోదించినట్లయితే, మళ్ళీ సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నికలు అనివార్యమవుతాయి. కనుక పార్టీ నేతలను అందుకోసం సన్నాహాలు మొదలుపెట్టమని ఆయన ఆదేశించారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా హైదరాబాద్ జంట నగరాలు మరియు చుట్టుపక్కల నివసించే ప్రాంతాలలో స్థిరపడిన ఆంద్రప్రజల ఓట్లను పొందాలంటే అంత వీజీ కాదని ఆయనకీ తెలుసు. ఎందుకో అందరికీ తెలుసు. కనుక కారణాలు మళ్ళీ ఏకరువు పెట్టనవసరం లేదు. అందుకే ఆయన ముందు జాగ్రత్తగా హైదరాబాద్ లో తెదేపాకు చెందిన కొందరు యం.యల్యేలను పార్టీలోకి రప్పించారు. అంతే కాకుండా ఖమ్మం జిల్లాకు చెందిన తెదేపా నేత తుమ్మల నాగేశ్వర రావును కూడా పార్టీలోకి రప్పించుకొన్నారు. మెట్రో రైల్ మార్గాన్ని అష్టవంకరలు తిప్పి మజ్లిస్ పార్టీని మచ్చిక చేసుకొనే ప్రయత్నాలు కూడా చాలానే చేసారు. ఈ మధ్యన ఆయన కొందరు మంత్రులను వెంటేసుకొని రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావుతో ఆరు గంటలసేపు ముచ్చట్లు కొట్టి, ఆయనను పొగిడింది కూడా ఆంద్రప్రజలను, హైదరాబాద్ లో ఉన్న బలమయిన ఆయన సామాజిక వర్గానికి చెందిన ప్రజలను, పారిశ్రామికవేత్తలను పడేయడానికేనని మీడియా కోడై కూస్తోంది. ఇక హైదరాబాదు జంట నగరాలలో నివసించే పేదలకి 125 గజాల భూమి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడం, అన్ని కులాలు, మతాల వారికీ ప్రార్ధన మందిరాలు, సామాజిక భవనాలకి శంఖు స్థాపనలు వంటి అనేక కార్యక్రమాలు కూడా పెట్టుకొన్నారు. కానీ ఇన్ని చేసినా ఈ ఆంద్ర జనాలు తెరాసకు ఓటేస్తారో లేదో? అనే అనుమానం మనసులో పీకుతూనే ఉంటుంది. అందుకే వారితో బాగా టచ్చు ఉన్నమాజీ తెదేపా నేతలు హైదరాబాద్ లో ఉంటూ తెరాసకు ఓటేయడమే బెటర్ కదా..తెరాసకి ఓటేస్తే మిమ్మల్ని బాగా చూసుకొంటుంది. తెరాస ఆంధ్రా పాలకులనే తప్ప ఆంద్ర ప్రజలని కాదని కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆంధ్ర జనాలు కన్విన్స్ అవుతారో లేదో ఎన్నికలు పెడితేగానీ తెలియదు. కానీ కంటోన్మెంట్ ఎన్నికలలో ఓటేశారు గాబట్టి జి.హెచ్.యం.సి. ఎన్నికలలో కూడా డెఫినెట్ గా మనకే ఓటేస్తారని తెరాస ఆశ.
http://www.teluguone.com/news/content/ghmc-elections-45-42434.html





