"ఛీ"వరకు ఒబామా కూడానా..?
Publish Date:Jun 18, 2016
Advertisement
ఇప్పటివరకు అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో మానవత్వం, కాస్త దయా గుణం కలిగిన వాడిగా ప్రపంచం చేత నీరాజనాలు అందుకున్నారు బరాక్ ఒబామా. రష్యా, చైనాలతో మైత్రి..క్యూబాపై ఆంక్షల ఎత్తివేత..హీరోషిమాను సందర్శించడం వంటి చర్యల ద్వారా ఆయన జేజేలందుకున్నారు. రెండవసారి అధ్యక్షుడిగా అతి త్వరలో వీడ్కోలు చెప్పబోతున్న తరుణంలో ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే వాస్తవాలు వెలుగు చూశాయి. సిరియా నియంత "బషర్ అల్ అసద్"ను గద్దె దించేందుకు ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాకు ఒబామా పూర్తి అండదండలు అందించారని ఓ రహస్య నివేదిక బయటకొచ్చింది. ఈ నివేదిక అమెరికాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తనకు నచ్చని ప్రభుత్వాలను కూల్చడానికి అమెరికా కుట్రలు చేయడం, నిధులు అందించడం ఎప్పటినుంచో అమలు చేస్తున్న కార్యక్రమం. ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యం స్థాపించడానికీ, మానవహక్కులను కాపాడటానికి తాను సాయం చేస్తానని అమెరికా చెప్పుకుంటోంది. ఈ క్రమంలో సిరియా అధ్యక్షుడు అసద్ 2000 వ సంవత్సరంలో తన తండ్రి చనిపోయినప్పటి నుంచి నేటీవరకు అధికారంలో ఉన్నాడు. ఈయన బాత్‌పార్టీ నాయకుడు..ఆ పార్టీ సిరియాలో ప్రగతీశీల విధానాలను అమలు చేస్తోంది. ఇది రుచించని అమెరికా సిరియాలో నియంతృత్వ పాలనను అంతం చేయాలని నిర్ణయించింది. అప్పటి నుంచి ప్రతిపక్ష గ్రూపులకు, అల్‌ఖైదాకు నిధుల వరద పారించింది. ముస్లింలతో సాన్నిహిత్యం పెంచుతానన్న వాగ్ధానం మేరకు ఒబామా సిరియాతో కూడా సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి కృషి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించినా రహస్య సహాయం కొనసాగించారు. చివరకు అల్‌ఖైదాను పక్కకు తప్పించి దాని స్థానంలో ఐఎస్ పుట్టుకొచ్చి ప్రపంచానికి పెనుసవాలు విసిరింది. ఐఎస్ తన భీకర దాడులతో అసద్ ప్రభుత్వాన్ని వణికించింది. అన్ని తమకు అనుకూలంగా జరుగుతున్నాయని ఆనందపడిన అగ్రరాజ్యానికి ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఐఎస్ తన భస్మాసుర హస్తాన్ని అమెరికాపైనే పెట్టింది. అప్పటికి గాని తత్వం బోధపడని అమెరికా ఇస్లామిక్ స్టేట్‌పై యుద్ధం ప్రకటించింది. ఇలా ఐఎస్ ఏర్పడటానికి ప్రత్యక్ష, పరోక్ష కారణం ఒబామానే అని నివేదిక సారాంశం. ఈ వార్తలపై ప్రస్తుతం అధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్, అమెరికా కాంగ్రెస్, సీఐఏ ఒబామాను టార్గెట్ చేశాయి.
http://www.teluguone.com/news/content/barack-obama-45-62460.html





