TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ చేంజ్.. సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా.!

Published on: Wed Nov 25, 2026 2:03PM

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో కీలక నాయకత్వ మార్పునకు రంగం సిద్ధమైంది. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) కల్యాణ్ కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు దశాబ్దకాలంగా ఫ్లిప్‌కార్ట్‌తో అనుబంధం కొనసాగించిన ఆయన ప్రయాణం ముగియనుండటంతో భారత ఈ-కామర్స్ రంగంలో ఆసక్తికర చర్చ మొదలైంది. కంపెనీ ప్రకటన ప్రకారం డిసెంబర్ 4 ఆయనకు చివరి పని దినం కానుంది. కొత్త సీఈఓ నియామకం పూర్తయ్యే వరకు చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ బాలాజీ త్యాగరాజన్, బోర్డు సభ్యులతో కలిసి సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు.

2013లో ఫ్లిప్‌కార్ట్‌లో చేరిన కల్యాణ్ కృష్ణమూర్తి తొలుత ఆర్థిక, విక్రయ విభాగాల బాధ్యతలు నిర్వహించారు. అనంతరం టైగర్ గ్లోబల్‌లో పనిచేసిన ఆయన 2016లో తిరిగి ఫ్లిప్‌కార్ట్‌లోకి వచ్చారు. 2017 జనవరిలో సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. 2018లో అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ వాటాను కొనుగోలు చేసిన తర్వాత కూడా గ్రూప్ నాయకత్వాన్ని కొనసాగించారు.

కల్యాణ్ కృష్ణమూర్తి నేతృత్వంలో ఫ్లిప్‌కార్ట్ వ్యాపారం గణనీయంగా విస్తరించింది. బిగ్ బిలియన్ డేస్ వంటి భారీ సేల్ ఈవెంట్లకు మరింత ఆదరణ పెరిగింది. కిరాణా, ఫిన్‌టెక్, క్విక్ కామర్స్ వంటి కొత్త వ్యాపార విభాగాల్లోకి సంస్థ అడుగుపెట్టింది. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాంతీయ భాషల్లో సేవలను అందిస్తూ వినియోగదారుల సంఖ్యను పెంచుకుంది. దేశవ్యాప్తంగా విక్రేతలు, చిన్న వ్యాపారవేత్తలకు డిజిటల్ వాణిజ్య అవకాశాలను విస్తరించడంలోనూ కీలక పాత్ర పోషించింది.

మరోవైపు ఫ్లిప్‌కార్ట్ తన హోల్డింగ్ కంపెనీ ప్రధాన కార్యాలయ చిరునామాను సింగపూర్ నుంచి భారత్‌కు మార్చిన నేపథ్యంలో సంస్థ ఐపీఓ ప్రణాళికలపై చర్చలు ఊపందుకున్నాయి. స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్, వాల్‌మార్ట్‌తో వ్యూహాత్మక నిర్ణయాలు, భవిష్యత్తు వ్యాపార విస్తరణ వంటి అంశాలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొత్త సీఈఓ ఎంపికతో పాటు ఐపీఓ దిశగా సంస్థ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే, కల్యాణ్ కృష్ణమూర్తి వైదొలగడానికి కచ్చితమైన కారణాలపై స్పష్టత లేదు. సంస్థలో అంతర్గత పరిణామాలు, ఐపీఓ జాప్యం, వాల్‌మార్ట్‌తో వ్యూహాత్మక భేదాభిప్రాయాలు వంటి అంశాలు ఆయన నిష్క్రమణకు కారణమై ఉండొచ్చన్న చర్చ పరిశ్రమ వర్గాల్లో సాగుతోంది. మరోవైపు ఐపీఓ ఆలస్యం కారణంగా ఉద్యోగులు తమ వాటాలను నగదుగా మార్చుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. గత ఏడాది కాలంలో పలువురు వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు సంస్థను వీడటం కూడా గమనార్హం.

దాదాపు పదేళ్లకు పైగా ఫ్లిప్‌కార్ట్ ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన కల్యాణ్ కృష్ణమూర్తి నిష్క్రమణతో సంస్థలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ఆయన స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? కొత్త నాయకత్వంలో ఫ్లిప్‌కార్ట్ ఐపీఓ దిశగా అడుగులు వేస్తుందా? అన్న ప్రశ్నలకు రానున్న రోజుల్లో సమాధానం లభించనుంది.


మీకు నచ్చవచ్చు: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.!

మీకు నచ్చవచ్చు: బీసీలకు రాజ్యాధికారం.. హైదరాబాద్‌పై గురి.. తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?


[ Flipkart CEO Kalyan Krishnamurthy resigns, Flipkart CEO, Walmart, Indian ecommerce, Big Billion Days, Flipkart leadership ]