TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గోల్డ్ మ్యాన్ చిన్ని గౌడ్‌పై ఐటీ ఉచ్చు.. బావమరిది పేరుతో కోట్ల బినామీ ఆస్తి గుర్తింపు.!

Published on: Mon Nov 23, 2026 8:22PM

తెలంగాణ గోల్డ్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన యాదగిరి చిన్ని గౌడ్ అలియాస్ దర్గా చిన్ని పహిల్వాన్ వ్యవహారంలో ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆయన ఆర్థిక లావాదేవీలు, ఆస్తులపై జరిపిన విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని రాయదుర్గ్‌లో ఆయనకు సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఓ బినామీ ఆస్తిని ఐటీ అధికారులు గుర్తించారు. ఈ ఆస్తితో పాటు దాని ద్వారా వస్తున్న అద్దె ఆదాయాన్ని కూడా తాత్కాలికంగా జప్తు చేశారు. చిన్ని గౌడ్ బావమరిది యాదగిరి ప్రణయ్ గౌడ్ పేరుతో ఉన్న ఈ భవనం వెనుక అసలు పెట్టుబడులు చిన్ని గౌడ్ కుటుంబానివేనని అధికారులు అనుమానిస్తున్నారు.

ఆదాయం లేకున్నా కోట్ల విలువైన భవనం ఎలా.?

ఐటీ అధికారుల విచారణలో రాయదుర్గ్‌లోని నవ ఖల్సా గ్రామంలో ఉన్న 222 చదరపు గజాల స్థలంపై దృష్టి పడింది. 2019 జూలై 1న ఈ స్థలాన్ని రూ.26.7 లక్షలకు కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉంది. ఇందులో రూ.1.7 లక్షలు నగదు రూపంలో, మిగిలిన రూ.25 లక్షలు మూడు బ్యాంకు లావాదేవీల ద్వారా చెల్లించారు. అయితే స్థలం కొనుగోలు చేసిన సమయంలో ప్రణయ్ గౌడ్‌కు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం లేకపోవడం అధికారులకు అనుమానాలు కలిగించింది.

ఆ స్థలంలో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ప్రతి అంతస్తులో రెండు చొప్పున 2BHK ఫ్లాట్లు ఉన్నాయి. భూమి కొనుగోలు నుంచి భవన నిర్మాణం వరకు అవసరమైన డబ్బును తానే సమకూర్చినట్లు ప్రణయ్ గౌడ్ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. దీంతో అసలు పెట్టుబడులు ఎవరివి? ఆస్తి ఎవరి సొమ్ముతో నిర్మించారు? అనే కోణంలో ఐటీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

భార్య ఖాతాలోకి అద్దె.. అక్కడి నుంచి భర్తకు బదిలీ.!

ఈ భవనాన్ని నెలకు రూ.3.2 లక్షల అద్దెకు ఇచ్చినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. అయితే భవనంపై యాజమాన్య హక్కులు లేని ప్రణయ్ గౌడ్ భార్య బ్యాంకు ఖాతాలోకి తొలుత అద్దె సొమ్ము జమ అయినట్లు బ్యాంకు లావాదేవీల పరిశీలనలో వెల్లడైంది. అనంతరం ఆ మొత్తాన్ని ఆమె తన భర్త ఖాతాలకు బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు.

తనకు నెలకు సుమారు రూ.1.76 లక్షలు అందుతున్నాయని, గతంలో ప్రణయ్ గౌడ్‌కు ఇచ్చిన డబ్బులను తిరిగి చెల్లిస్తున్నారని ప్రణయ్ గౌడ్ వివరణ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి రుణ ఒప్పంద పత్రాలు లేకపోవడం, భవన నిర్మాణానికి చేసిన చెల్లింపుల కోసం తనఖా రుణం తీసుకున్నట్లు ఆధారాలు లేకపోవడం అధికారులకు మరిన్ని సందేహాలు కలిగించింది.

బినామీ ఆస్తిగా గుర్తింపు.. తాత్కాలిక అటాచ్‌మెంట్.!

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రణయ్ గౌడ్‌ను బినామీదార్‌గా, ఆయన బావమరిదిని అసలు లబ్ధిదారుగా పేర్కొంటూ ఐటీ శాఖలోని బినామీ ప్రొహిబిషన్ యూనిట్ తాత్కాలిక జప్తు ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 17న జాయింట్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ అటాచ్‌మెంట్‌కు ఆమోదం తెలిపారు. బినామీ ఆస్తుల నిషేధ చట్టం-1988లోని సెక్షన్ 24(4)(a)(i) కింద ఈ చర్యలు చేపట్టారు. విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత అధికారుల అనుమతి లేకుండా ఆస్తిని విక్రయించడం, బదిలీ చేయడం లేదా ఇతరులకు అప్పగించడం సాధ్యం కాదు.

700 గ్రాముల లెక్కల్లో చూపని బంగారం స్వాధీనం.!

మరోవైపు, చిన్ని గౌడ్ ఆర్థిక లావాదేవీలపై గతంలోనూ ఐటీ అధికారులు దృష్టి సారించారు. ఏప్రిల్ 3న ఆయనకు సంబంధించిన టీవీ, యూట్యూబ్ ఇంటర్వ్యూలను పరిశీలించిన అధికారులు.. అనంతరం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 247 కింద విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన వద్ద మొత్తం 900 గ్రాముల బంగారాన్ని గుర్తించగా, అందులో లెక్కల్లో చూపని 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

దీని విలువ సుమారు రూ.కోటి ఉంటుందని అంచనా వేశారు.అంతేకాదు, అద్దెలు, భూముల లావాదేవీల ద్వారా వస్తున్న ఆదాయంపైనా అధికారులు ఆరా తీశారు. ఇన్ని ఆస్తులు, ఆర్థిక లావాదేవీలు ఉన్నప్పటికీ చిన్ని గౌడ్ తన ఆదాయపు పన్ను రిటర్నుల్లో ఏటా కేవలం రూ.4 లక్షల ఆదాయాన్నే చూపిస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం.

దీంతో చూపిస్తున్న ఆదాయానికి, కూడబెట్టిన ఆస్తులకు మధ్య ఇంత వ్యత్యాసం ఎందుకు ఉంది? బావమరిది పేరుతో ఉన్న భవనం వెనుక అసలు పెట్టుబడిదారులెవరు? అద్దె రూపంలో వస్తున్న ఆదాయం ఎవరికి చేరుతోంది? అనే ప్రశ్నలపై ఐటీ శాఖ దృష్టి సారించింది. గోల్డ్ మ్యాన్ చిన్ని గౌడ్ ఆర్థిక లావాదేవీల వెనుక ఉన్న అసలు లెక్కలను తేల్చేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

 

మీకు నచ్చవచ్చు: ఒక్క రోగికి వారంలో 800 గ్లౌజులా..నిమ్స్‌లో అక్రమాల దందా.!

మీకు నచ్చవచ్చు: అమెరికా కస్టడీలో 1,389 మంది భారతీయ చిన్నారులు.!


[ Chinni Goud, Telangana Gold Man, IT Department, Income Tax Raids, Benami Properties, Yadagiri Chinni Goud, Darga Chinni Pehlwan, Yadagiri Pranay Goud ]