అమెరికా కస్టడీలో 1,389 మంది భారతీయ చిన్నారులు.!
Published on: Mon Nov 23, 2026 8:03PM

అమెరికాలో అక్రమ వలసల నియంత్రణపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఆసక్తికర గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. గత నాలుగేళ్లలో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు లేకుండా అమెరికా సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించిన 1,389 మంది భారతీయ చిన్నారులను అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (USCBP) గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
2023 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఈ చిన్నారులను అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, కస్టడీలోకి తీసుకున్న భారతీయ చిన్నారుల్లో ఇప్పటివరకు ఒక్కరిని కూడా తిరిగి భారత్‌కు పంపలేదని నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో వీరి భవిష్యత్తు, సంరక్షణ అంశాలు చర్చనీయాంశంగా మారాయి.
ఏటా తగ్గుతున్న భారతీయ చిన్నారుల సంఖ్య.!
అమెరికాకు ఒంటరిగా వస్తున్న భారతీయ మైనర్ల సంఖ్యను పరిశీలిస్తే గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 730 మంది చిన్నారులను అధికారులు గుర్తించారు. 2024లో ఈ సంఖ్య 517కు తగ్గింది. 2025లో మరింత తగ్గి 91కు చేరగా.. 2026 ఆర్థిక సంవత్సరంలో కేవలం 51 మంది మాత్రమే నమోదయ్యారు. ఇక 2027 ఆర్థిక సంవత్సరం తొలి నెల అయిన అక్టోబర్ 2026లో ఇద్దరు చిన్నారులు మాత్రమే ఒంటరిగా వచ్చినట్లు గుర్తించారు.
కఠినమైన నిబంధనలే కారణమా.?
భారతీయ చిన్నారుల విషయంలోనే కాకుండా ఇతర దేశాల నుంచి ఒంటరిగా అమెరికాకు వస్తున్న మైనర్ల సంఖ్యలోనూ ఇదే తరహా తగ్గుదల కనిపిస్తోంది. సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా, ఇమిగ్రేషన్ నిబంధనల అమలు, అక్రమ వలసలపై వేగవంతమైన చర్యలు ఈ మార్పునకు కారణాలుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి.

గతంలో కొందరు కుటుంబాలు తమ లేదా బంధువుల చట్టపరమైన వలస అవకాశాలను పెంచుకోవాలనే ఉద్దేశంతో మైనర్లను అమెరికాకు పంపేవారన్న అభిప్రాయాలు ఉండేవి. అయితే, ప్రస్తుత కఠిన నిబంధనలు, అక్రమ వలసలపై చర్యల నేపథ్యంలో ఇలాంటి ప్రయత్నాలు తగ్గుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
అక్రమ వలసల జాబితాలో భారత్‌కు మూడో స్థానం.!
మరోవైపు, అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారి విషయంలోనూ భారతీయులకు సంబంధించిన గణాంకాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో 30,528 మంది భారతీయుల విషయంలో అమెరికా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ విషయంలో మెక్సికో, కెనడాల తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
మీకు నచ్చవచ్చు: ఒక్క రోగికి వారంలో 800 గ్లౌజులా..నిమ్స్‌లో అక్రమాల దందా.!
మీకు నచ్చవచ్చు: ఫుట్‌పాత్‌పై బైకర్ల దూకుడు.. ముగ్గురు యువతుల ధైర్యానికి హ్యాట్సాఫ్.!
[ US Immigration, Indian Children, Illegal Immigration, USCBP Report, NRI News ]


