గ్యాంగ్ లీడర్ గా చిరు చించేశాడు..!
on Jun 13, 2016
ఏజ్ 60ల్లో ఉన్నా మెగాస్టార్ డ్యాన్స్, గ్రేస్ మాత్రం 20ల్లో ఉంది. సినిమాలకు దూరంగా ఉంటున్నా, డ్యాన్స్ లో ఆయనకున్న పట్టు ఏమాత్రం తగ్గలేదు. చిరు స్టెప్స్ వేస్తుంటే, ఆడిటోరియమ్ హోరెత్తిపోయింది. డ్యాన్స్ తో చిరు చేసిన మ్యాజిక్ ఆడియన్స్ ను హోరెత్తించింది. ఇంతకూ ఇదంతా దేని గురించి అని అడుగుతున్నారా..? నిన్న జరిగిన సినీ'మా' అవార్డ్స్ 2016 గురించే ఈ ఉపోద్ఘాతమంతా.. ముందు నుంచే అనుకున్నట్టుగా, ఈవెంట్ కు చిరు డ్యాన్స్ హైలైట్ గా నిలిచింది. మెగాస్టార్ స్టేజ్ పై పెర్ఫామ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి. వజ్రోత్సవ వేడుకల్లో చేసినా, అది అప్పటికప్పుడు పైకి ఎక్కి చేసిన డ్యాన్స్. ఇంత ప్లాన్డ్ గా, ఒక ఈవెంట్ కు మెగాస్టార్ డ్యాన్స్ పెర్ఫామ్ చేయడం మాత్రం ఫస్ట్ టైమ్.
వైట్ షర్ట్, బ్లాక్ ఫ్యాంట్ తో స్టేజ్ పైకి వచ్చిన చిరు, మొదట తను వేసిన సూపర్ హిట్ పాత్రలతో మాట్లాడుతున్నట్టుగా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత శ్రీకాంత్, నవదీప్, సునీల్, సాయి ధరమ్ తేజలు పైకొచ్చి చిరును డ్యాన్స్ వేయమని అడగడంతో చిరు స్టెప్స్ స్టార్టయ్యాయి. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్, ముఠామేస్త్రి టైటిల్ సాంగ్స్ లో చిరు గ్రేస్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆయన డ్యాన్స్ వేసిన పావుగంట పాటు మొత్తం ఆడిటోరియమ్ ఉర్రూతలూగింది. సోషల్ నెట్ వర్కింగ్ లో షేర్ అవుతున్న ఈ వీడియో చూసి, మెగాభిమానులు బాస్ ఈజ్ బ్యాక్ అంటూ పండగ చేసుకుంటున్నారు.